పుల్వామా ఉగ్రదాడి ఘటన బాధాకరమని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో భారత ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యలకైనా ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరకుండా కేంద్ర, రాష్ట్రాలు పటిష్ట వ్యూహాన్ని అనుసరించాలని సీఎం సూచించారు. అమరుల త్యాగాలను జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. జవాన్ల కుటుంబాలకు ప్రతిఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వీర జవాన్ల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని చంద్రబాబు అన్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి ఒక్కో అమర జవాన్ కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున సహాయం ప్రకటిస్తున్నామని సీఎం తెలిపారు.
"అమర జవాన్ల త్యాగాలను జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. భారత సైనికులు నిరంతరం ఈ దేశాన్ని రక్షించే బాధ్యతను భుజాన వేసుకుని అహర్నిశలూ అప్రమత్తంగా వుంటూ తమ విధులను నిర్వర్తిస్తున్నారు. మన కుటుంబాలను రక్షిస్తున్నారు. ప్రాణాలను సైతం ఫణంగా నిలిపి తెగువ చూపుతూ మనందరిలో స్ఫూర్తిని నింపుతున్నారు. పుల్వామా దాడిలో ఒక్కరు, ఇద్దరు కాదు, 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడం జాతిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇలాంటి విపత్కర సమయంలో జవాన్ల కుటుంబాలకు మనం అండగా నిలవాలి. ఆ వీర జవాన్ల కుటుంబాలకు నైతికస్థైర్యం అందివ్వడం మనందరి తక్షణ కర్తవ్యం. "
"సైనికుల జీవితాలను మనం అందించే సాయంతో వెలకట్టలేం. కానీ, మనవంతు సహకారం అందించాల్సిన బాధ్యతను విస్మరించలేం. వీర జవాన్ల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పుల్వామా ఘాతుకానికి తమ నిరసన తెలియజేస్తున్నారు. ఒక్క గొంతుకగా నిలిచి అమరుల కుటుంబాలకు తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఒక్కొక్క అమర జవాన్ కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రకటిస్తున్నాను. - నారా చంద్రబాబునాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి."