పురపాలక సంఘాల ఎన్నికలకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ జారీ చేసిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని వాదిస్తూ ప్రభుత్వం హైకోర్టులో సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై అత్యవసర విచారణ జరిపి ఉత్తర్వుల ఉపసంహరణకు ఆదేశాలివ్వా లని కోరింది. గ్రామ, వార్డు సచి వాలయాల విభాగం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ అత్యవసర విచారణ నిమిత్తం సింగిల్ జడ్జి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ముందుకు వచ్చింది. ప్రభు త్వం తరుపున అడ్వొకేట్ జనరల్ ఎస్ శ్రీరాం వాదనలు వినిపించారు. ఎస్ఈసీ ఆదేశాల వల్ల రాష్ట్రంలో ఇప్పటికే అమల్లో ఉన్న సంక్షేమ కార్యక్రమాల అమలుకు విఘాతం కలుగుతుందని దీనివల్ల పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందే పరిస్థితి ఉండదని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పింఛన్లు, ఇతర పథకాలకు సంబంధించి లబ్దిదారుల నుంచి బయోమెట్రిక్ తీసుకునేం దుకు మొబైల్ ఫోన్లు అవసరమవుతా యన్నారు. దీన్ని నిలువరించటం వల్ల ప్రజలు నష్టపోతారన్నారు. ఎన్నికల ప్రక్రియకు వలంటీర్ల వ్యవస్థకు ఎలాంటి సంబంధం లేదన్నారు. వాలంటీర్లకు రాజకీయాలతో సంబంధం లేదని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పార్టీల కతీతంగా లబ్దిదారులను గుర్తించి స్వచ్చంద వేసలందిస్తున్నారని వివరించారు.
అలాంటప్పుడు నిత్యావసరాలను, సంక్షేమ కార్యక్రమాలను ఆపే అధికారం ఎఈసీకి ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులతో వాలంటీర్లు ఏ పని చేసే అవకాశం లేదన్నారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఫిర్యాదులు వచ్చినందునే పురపాలక ఎన్నికల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా వలంటీర్లను నియంత్రించేలా ఆదేశాలు జారీ చేశామనే ఎన్నికలకమిషన్ వాదన సరైంది కాదన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వచ్చినవి అవాస్తవ ఆరోపణలను ఆధారాలులేవని ఏజీ కోర్టుకు వివరించారు. ఒకవేళ ఆధారాలతో ఆరోపణలు వాస్తవమని తేలితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికెలాంటి అభ్యంతరం లేదని అయితే మొత్తం వ్యవస్థను నిలువరించే అధికారం లేదన్నారు. ఎన్నికల కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులు వాలంటీర్లను బెదిరించేవిగా ఉన్నాయన్నారు. ఉద్యోగం నుంచి తొలగిస్తామని ప్రకటించటం తమకు విస్తృత అధికారాలు ఉన్నాయనే భావన సమంజసం కాదన్నారు. వలంటీర్ల వ్యవస్థ ద్వారా పార్టీల కతీతంగా అర్హులైన పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయని తెలిపారు. ఇంటింటికీ తిరిగి పింఛన్ అందిస్తున్న వారి స్వచ్చంద సేవలను ఎలా కట్టడి చేస్తుందని ప్రశ్నించారు. ఇతర సంక్షేమ పథకాలు కూడా నిషక్షపాతంగా అమలవుతున్నాయని చెప్పారు. ఎన్నికల విధుల్లో ఏమాత్రం భాగస్వామ్యం కాని వాలంటీర్లను పూర్తి స్థాయిలో స్తంభింపచేస్తే అందాల్సిన ఫలాలు అందవన్నారు. ఎస్ఈసీ ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు. దీని పై ఈ రోజు కూడా విచారణ చేసిన న్యాయస్థానం, తీర్పుని రిజర్వ్ చేసింది