వైసీపీ ప్రభుత్వం రాగానే అమరావతిని విచ్ఛిన్నం చేయడానికి వాడిన పదం ఇన్ సైడర్ ట్రేడింగ్ అని, జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ అధికార వికేంద్రీకరణకు వక్ర భాష్యాలు చెబుతూ, ప్రజలు ముక్కున వేలేసుకునేలా ప్రవర్తించారని, అనేక సందర్భాల్లో వికేంద్రీకరణ అనే పదానికి అర్థం తెలియకపోయినా ఆ పదాన్నే వాడాడని టీడీపీ నేత, తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలే కరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! ఎప్పుడో, ఎక్కడో విన్న మాటకు అర్థం, అంతరార్థం తెలియక పోయినా దాన్ని జగన్మోహన్ రెడ్డి బాగా వాడుకున్నాడు. అధికార వికేంద్రీకరణ అనే పదానికి అర్థమేదైతో ఉందో, దానికి పూర్తి విరుద్ధంగా స్థానిక సంస్థల హక్కులు కాలరాసేలా ఈ ముఖ్యమంత్రి, తన ప్రభుత్వంలో అనేక జీవోలిచ్చాడు. వాటిలో గతంలో ఇచ్చిన జీవోనెం-2 ఒకటి. వీఆర్వోలకు పంచాయతీలపై పెత్తనం దఖలు పరిచే ఆలోచన చేశారు. వారిపై ఆధార పడి పంచాయతీలు (పల్లెలు) నడిస్తే, జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు ఉరఫ్ జగన్ బృందమైన వారు, కలెక్టర్లను అడ్డు పెట్టుకొని, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేశాడు. నేడు దానికి కొనసాగింపుగా, పంచాయతీ సర్పంచ్ ల ఆమోదం లేకుండా, అసలు వారికే తెలియకుండా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 14వ ఆర్థిక సంఘం నిధులైన రూ.344.93 కోట్లను విద్యుత్ బిల్లుల చెల్లింపు పేరుతో కాజేశారు. పలానా దానికి ఇవ్వాలి... ఇచ్చేశాను పో అని సర్పంచ్ లను బదిరించినట్లు గా ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వమే లాగేసుకుంది. పంచాయతీలపై రాష్ట్రప్రభుత్వమే నిధుల వినియోగం పేరుతో దౌర్జన్యం చేసింది. 14వ ఆర్థిక సంఘం నిధులను ఇష్టమొచ్చినట్టు ఖర్చుపెట్టడానికి వీల్లేదు. సదరు నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇష్ట మొచ్చినట్లు వాడుకోవడానికి వీల్లేదని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. 14వ ఆర్థిక సంఘం ఇచ్చే నిధులను పంచాయతీలు వేటికి ఖర్చుపెట్టాలనేది కూడా సదరుసంఘమే చాలా స్పష్టంగా ఎప్పుడోచెప్పింది. పల్లెల్లో పారిశుధ్యం, తాగునీరు, ప్రజారోగ్యం, వీధిదీపాల ఏర్పాటు-వాటి నిర్వహణ, అంతర్గత రోడ్ల నిర్మాణం, డ్రైనేజ్ వ్యవస్థ, అంటువ్యాధుల నియంత్రణ, సామాజిక ఆస్తుల అభివృద్ధి మరియు వాటి నిర్వహణ, శ్మశానాల అభివృద్ధి వంటి వాటికి మాత్రమే 14వ ఆర్థిక సంఘం నిధులు వినియోగించాలి.
ఆ నిధులు వస్తాయనే, సర్పంచ్ లు కొందరు ఇప్పటికే వివిధ రకాల పనులు చేసేశారు . ఇప్పుడు ప్రభుత్వమేమో వారికే తెలియకుండా 14వఆర్థిక సంఘం నిధులైన రూ.344 కోట్లను విద్యుత్ బకాయిల పేరుతో లాగేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల నుంచి దాదాపు రూ.3వేల కోట్ల వరకు విద్యుత్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని ఒక లెక్క ఉంది. కానీ వాటికి చెల్లించాల్సిన సొమ్మును స్థానిక సంస్థల జనరల్ ఫండ్స్ నుంచి మాత్రమే వాడాలి. జనరల్ ఫండ్స్ రావాలంటే పంచాయతీలను ప్రభుత్వం ఆర్థికంగా బలోపేతం చేయాలి. కానీ జగన్ ప్రభుత్వం అలాంటివేవీ ఈ రెండేళ్లలో చేయలేదు. విద్యుత్ పంపిణీ, మరియు ఉత్పత్తి సంస్థలకు ఉన్న బకాయిల కోసం కేంద్ర ఇంధనశాఖ లిక్విడిటీ ఇన్ ఫ్యుజియన్ స్కీమ్ లో రూ.6,600 కోట్ల వరకు ఏపీప్రభుత్వానికి రుణం అందిస్తామని చెప్పింది. ఆ రుణంలో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే రూ.3,300 కోట్లు తీసేసుకుంది. రెండో విడత రుణం ప్రభుత్వానికి రావాలంటే, సదరు ప్రభుత్వం విద్యుత్ డిస్కమ్ లకు ఉన్న బకాయిలు చెల్లించాలి. అందులో భాగంగానే పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ, సర్పంచ్ ల హక్కులను కాలరాస్తూ, సర్పంచ్ లను తోలు బొమ్మలను చేసి, ఏపీ ప్రభుత్వం రూ.344కోట్ల 14వ ఆర్థిక సంఘం నిధులను తమ ఖాతాలో వేసుకుంది. ఇది ముమ్మాటికీ చాలా దుర్మార్గమైన చర్య. స్థానిక సంస్థల బలోపేతానికి జగన్ ప్రభుత్వం ఈ విధంగా అడుగడుగునా తూట్లు పొడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి తన అవసరాలు తీర్చుకోవడానికి, చివరకు ప్రజాక్షేమానికి వినియోగించాల్సిన కేంద్రని ధులను కూడా తన జేబులో వేసుకోవడానికి సిద్ధమయ్యాడు.