భన్వర్‌లాల్... ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆయన పేరు అన్ని టీవీ ఛానెళ్లలో ప్రతిధ్వనిస్తూనే ఉండేది. అలాంటి భన్వర్‌లాల్ పదవి కాలం అక్టోబర్ 31 (ఇవాల్టితో) ముగిసింది... 1983 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన భన్వర్‌లాల్ ఆంధ్రప్రదేశ్ క్యాడెర్ అధికారి.... కొత్త ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా ఆయన స్థానంలో తెలంగాణ ఎన్నికల సంఘం ఇన్‌చార్జీ అనూప్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు...
అయితే, ఆయన రిటైర్ అయ్యారో లేదో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాజీ ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ పై క్రమశిక్షణా చర్యలకు ఆదేశించింది... భన్వర్ లాల్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి అంటూ, ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఎస్సీ సింగ్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బకాయిలు చెల్లించని కారణంగా భన్వర్‌లాల్‌పై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించనట్లు తెలుస్తోంది.
గతంలో భన్వర్‌లాల్ ప్రభుత్వ బంగ్లా దుర్వినియోగం చేసారు అనే ఆరోపణలు ఉన్నాయి... దీంతో భన్వర్‌లాల్ కు ప్రభుత్వం రూ. 17 లక్షల జరిమానా విధించింది. ఈ జరిమానా సమీక్షంచాలి అని భన్వర్‌లాల్ కోరటంతో, గత ప్రభుత్వం రూ. 4,37,500 లకు కుదించింది. అయితే, అప్పటి నుంచి, ఇప్పటి వరకు, ఒక్క పైసా కూడా బకాయిలు చెల్లించలేదు. దీంతో ఆయనపై క్రమశిక్షణా చర్యలకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది.