విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ఎంత అన్యాయం జరిగిందో.. రాష్ట్రంలో ఆర్థికంగా ఎంత దయనీయ స్థితికి చేరుకుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఉద్యోగులకు జీతాలివ్వడానికి - సంక్షేమ పథకాలకు కూడా డబ్బుల్లేని పరిస్థితి. అయితే ఇవన్నీ మన ఆంధ్రుడి కష్టం ముందు చిన్నబోయాయి... మనల్ని నడిపిస్తున్న నాయకుడు సత్తా ఏంటో మరో సారి రుజువైంది.... సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకుంటూ, రియల్ గవర్నెన్స్ కోసం ముందుకెళ్తు, నదుల అనుసంధానంతో చరిత్ర సృష్టించి, సాంకేతిక పరిఙ్ఞానంతో పంటలను కాపాడి, రాయలసీమలో కరువు నివారణకు చర్యలు తీసుకుని, సరళమైన పారశ్రామిక విధానంతో, ఆంధ్రప్రదేశ్ అన్ని రంగంల్లో అభివృద్ధిలో దూసుకుపోతుంది... ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ జాతీయ సగటును మించి ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు సాధించింది...
ప్రస్తుత ఆర్థిక సంవత్సర ఆరు నెలల ప్రగతిలో రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ డిస్టింక్షన్ సాధించింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 6 నెలల ప్రగతి నివేదికను ముఖ్యమంత్రి గురువారం మీడియా సమావేశంలో వివరించారు. భారత్ దేశ వృద్ధి రేటు 5.8 ఉండగా, ఏపీ 11.37 సాధించి రెట్టింపు స్థానాన్ని సాధించింది. వీటిలో అత్యధికంగా వ్యవసాయ రంగం 25.60 సాధించి అగ్రగామిగా ఉండగా, ఇండస్ట్రీ అభివృద్ధి 7.43, సర్వీస్ సెక్లార్ రంగం 8.38శాతం సాధించింది. 2015-16లో ఏపీ వృద్ధిరేటు 10.95శాతం కాగా జాతీయ వృద్ధిరేటు 8.01శాతం. 2016-17లో ఏపీలో 11.61శాతం వృద్ధిరేటు సాధిస్తే...జాతీయ సగటు 7.11శాతం మాత్రమే. ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జీవీఏ వృద్ధిరేటులో ప్రాథమికరంగంలో మత్స్యరంగం టాప్‌లో ఉంది. ఈ రంగంలో 43.43శాతం వృద్ధిరేటు కనిపించింది. అయితే గత ఏడాది ఇదే త్రైమాసికం వృద్ధిరేటు 52.95శాతంతో పోలిస్తే ఇది తక్కువే. వ్యవసాయ రంగంలో గణనీయమైన ప్రగతి కనిపించింది.
ఈ ఏడాది హార్టీకల్చర్‌లో 18.62శాతం, లైవ్‌స్టాక్‌లో 12.86శాతం వృద్ధిరేటు వచ్చింది. ఫారెస్ర్టీ, లాగింగ్‌లో మైనస్ వృద్ధిరేటు నమోదుకావడం గమనార్హం. మరోవైపు పారిశ్రామిక రంగంలో రెండో త్రైమాసికంలో మైనింగ్‌లో 7.82శాతం, తయారీరంగంలో 7.89శాతం, విద్యుత్తు, గ్యాస్, నీటి సరఫరా రంగంలో 6.65శాతం, నిర్మాణ రంగంలో 5.28శాతం వృద్ధి రేటుతో వెరసి.. 6.8శాతం కనిపించింది. సేవారంగంలో రియల్ ఎస్టేట్, సంబంధిత సేవల్లో 11.17శాతం, కమ్యూనికేషన్స్‌లో 9.9శాతం, వ్యాపారం, హోటల్స్, రెస్టారెంట్స్‌లో 5.95శాతం, రవాణారంగంలో 6.69శాతం..ఇలా మొత్తంగా సేవా రంగంలో 8.1శాతం వృద్దిరేటు సాధించారు. తాము ఇంత కష్టపడుతుంటే కొంతమంది కథలు, కాకరకాయలు చెప్తున్నారంటూ, ప్రతిపక్షాన్ని ఉద్దేశించి విమర్శించారు. గత మూడేళ్లలోనూ ఏపీ వృద్ధి రేటులో ముందుందని, ఇలా 15-20ఏళ్లపాటు సాధిస్తే ప్రపంచంలో నంబర్‌వన్ అవుతామని ధీమా వ్యక్తం చేశారు.