మోదీ ఈ మధ్య చేసిన మంచి పని ఏదైనా ఉంది అంటే, అది అగ్రకుల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనుకోవడం. దానికి మంత్రివర్గం ఆమోదం పలికిన తరువాత ప్రకటన చేయగా.. వెంటనే పార్లమెంటు ఆమోదం, రాష్ట్రపతి ఆమోదం కూడా పూర్తయ్యాయి. దీంతో... ఈ చట్టం అమలు చేయడానికి అన్ని దారులూ తెరుచుకున్నాయి. ఇది రాజకీయం కోసం చేసినా, ఓట్లు కోసం చేసినా, ప్రజలకు మంచి కాబట్టి, ఎవరైనా స్వాగతిన్చాల్సిందే. రాజకీయ పార్టీలు ఎవరైనా, ఓట్లు కోసమే చేస్తారు. ప్రజలకు మించి జరిగితే అదే చాలు. ఇప్పుడీ చట్టాన్ని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ పోయిన వారం అమలు చేయడానికి నిర్ణయించింది. దీంతో... అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ ఇస్తున్న తొలి రాష్ట్రంగా గుజరాత్ క్రెడిట్ కొట్టేసింది.
అయితే, ఈ చట్టాన్ని అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రాష్ట్రానికి సంబంధించి ఆయా వర్గాల వివరాలు, రిజర్వేషన్ల అమలులో కేంద్రం విధించిన నిబంధనలకు అనుగుణంగా విధివిధానాలు ఖరారు చేసే పనిలో పడింది. ఈ బిల్లు గత వారమే పార్లమెంట్లో ఆమోదం పొంది.. ఆ తర్వాత రాష్ట్రపతి ఓకే చెప్పినా.. రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ఆయా రాష్ట్రాలు కొన్ని నిబంధనలను సవరించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ దిశగా కసరత్తును ముమ్మరం చేసింది. వీలైనంత త్వరగా ఆంధ్రప్రదేశ్ లోనూ ఈబీసీలకు రిజర్వేషన్లు అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. దీని పై అన్ని పనులు చకచకా జరుగుతున్నాయి.
నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఈ బిల్లు లోక్సభ, రాజ్యసభల్లో పెద్దగా అడ్డంకులు లేకుండానే ఆమోదం పొందింది. ఉభయ సభల్లోనూ ఆమోదం పొందిన ఈ బిల్లును రెండు రోజుల క్రితం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోదించడంతో చట్టంగా మారింది. అన్ని పార్టీలు ఆమోదించటంతో, మిగతా రాష్ట్రాలూ దీన్ని వీలైనంత త్వరగా అమల్లోకి తేనున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగ రంగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా కేంద్రం 124వ రాజ్యాంగ సవరణ బిల్లును ఉభయ సభల్లో ప్రవేశపెట్టగా సుధీర్గ చర్చల అనంతరం ఆమోదం లభించింది. పార్లమెంట్ ఉభయ సభలతో ఆమోదం పొందిన రాజ్యాంగ సవరణ బిల్లును తాజాగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదించారు. రాజముద్రతో ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్ల అంశం చట్టరూపం దాల్చినట్టైంది.