ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ స్వాతంత్య్ర దినోత్సవాన రెండు కీలక ఘట్టాలను పూర్తి చేసిందని ఆశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌లు వెల్లడించారు. గాలేరు నగరి సుజల స్రవంతిలో భాగంగా అవుకు రెండో బైపాస్ టన్నెల్ నిర్మాణం పూర్తయిందని.. వంశధార రెండో దశ పనుల్లో భాగంగా హిరమండలం జలాశయానికి నీటి ప్రవాహాలు చేరుకున్నాయని బుధవారం రాత్రి వివరించారు. గాలేరు నగరి సుజల స్రవంతిలో భాగంగా అవుకు వద్ద సొరంగం నిర్మాణం చేపట్టారు.
ఇప్పుడు రెండో బైపాస్ సొరంగం తవ్వకం పూర్తయిందని అధికారులు వివరించారు. మరో రెండు మూడు రోజుల్లో లైనింగు పనులు చేపట్టి సొరంగం ద్వారా నీటిని పంపిస్తామని చెబుతున్నారు. మొత్తం 11 వేల క్యూసెక్కుల శ్రీశైలం నీటిని గండికోట జలాశయానికి మళ్లిస్తామన్నారు. దాదాపు రోజుకు టీఎంసీ చొప్పున నీళ్లు మళ్లించవచ్చు. గండికోట జలాశయం ఈ నెలాఖరుకల్లా పూర్తిస్థాయిలో నీటితో నింపే అవకాశం ఉందని శశిభూషణ్‌కుమార్ చెప్పారు.
వంశధార రెండో భాగం రెండో దశ పనుల్లో భాగంగా నీటిని హిరమండలం జలాశయానికి తరలిస్తున్నారు. వరద కాలువ ద్వారా ఈ నీటిని హిరమండలం జలాశయానికి విడుదల చేశారు. ఆ నీరు 33వ కిలోమీటరు వద్ద జలాశయంలోకి చేరిందని అధికారులు పేర్కొన్నారు. ఎప్పటి నుంచో పెండింగులో ఉన్న ఈ పనులు పూర్తయ్యాయని, హిరమండలం జలాశయంలో నీటిని నింపడం వల్ల అక్కడ ఆయకట్టు స్థిరీకరణతో పాటు రెండో పంటకు నీరిచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సేకరణ: ఈనాడు