ఒక పక్క లోక్‌సభలో తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాసం పై చర్చ రేపు జరుగుతున్న నేపధ్యంలో, ఇటు రాజ్యసభలో కూడా తెలుగుదేశం పార్టీ ఒత్తిడి తెచ్చింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీలు దూకుడుగా వ్యవహరించారు. ఏపీకి జరిగిన అన్యాయంపై చర్చకు పట్టుబట్టారు. చివరికి సోమవారం చర్చ చేపట్టడానికి సభాధ్యక్షుడు వెంకయ్య అంగీకరించారు. బుధవారం ఉదయం సభ ప్రారంభమైన తర్వాత 267 నిబంధన కింద తాను ఇచ్చిన నోటీసుపై చర్చ చేపట్టాలని టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ప్రస్తావించారు. ప్రతిపక్షనేత గలాం నబీ ఆజాద్, ఎస్పీ నేత రామ్‌గోపాల్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ, సీపీఎం నేత టీకే రంగరాజన్‌తో పాటు తదితరులు ఆయా అంశాలపై ఇదే నిబంధన కింద నోటీసులు ఇచ్చారని వెంకయ్య చెప్పారు.
రమేశ్ ఇచ్చిన నోటీసు మినహా... మిగిలిన నోటీసులను తిరస్కరించి, వాటిని జీరో అవర్ నోటీసు కింద మారుస్తున్నానని స్పష్టం చేశారు. రమేశ్ నోటీసును స్వల్పకాలిక చర్చకు మార్చి చర్చకు అనుమతిస్తున్నానని, రెండ్రోజుల్లో చర్చ ఉంటుందని ప్రకటించారు. తక్షణమే చర్చ చేపట్టాలని రమేశ్ డిమాండ్ చేశారు. చర్చకు అనుమతించడానికి తనకు అభ్యంతరం లేదని కానీ సంబంధిత మంత్రి సిద్ధంగా ఉండాలి కాదా అని వెంకయ్య అన్నారు. ఈ క్రమంలో గందరగోళ పరిస్థితి ఏర్పడడంతో మధ్యాహ్నం 12 గంటలకు సభను వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా సుజనా చౌదరి, సీఎం రమేశ్ చర్చ గురించి ప్రస్తావించారు.
ఈ అంశంపై చర్చించడానికి కనీసం నాలుగు గంటలు కేటాయించాలని, కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వస్తే సభ సజావుగా నడవడానికి సహకరిస్తామని సుజనా చౌదరి తెలిపారు. దానికి వెంకయ్య అంగీకరించారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా పై సోమవారం స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఈ మేరకు బీఏసీలో నిర్ణయించినట్లు తెలిసింది. అయితే ఆంధ్రప్రదేశ్ సమస్యల పై తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు ఇంత ఆందోళన చేసినా, వైసీపీ ఎంపీలు విజయసాయి, వేమిరెడ్డి ప్రేక్షకపాత్ర పోషించారు. మోడీ, అమిత్ షా ఏమన్నా అంటారేమో అని, అలాగే చూస్తూ కూర్చున్నారు.