బాబ్లీ కేసులో రేపు చంద్రబాబు తరుపున ధర్మాబాద్ కోర్టుకు లాయర్లు హజరుకానున్నారు. ఆయన తరుపున నాన్ బెయిల్ పై అడ్వకేట్ సుబ్బారావు రీకాల్ పిటీషన్ వేయనున్నారు. వారెంట్లు అందుకున్న మిగిలిన ఏపీ నేతల తరపునా రీకాల్ పిటిషన్లు వేసే అవకాశం ఉంది. ఇదే కేసులో వారెంట్లు అందుకున్న తెలంగాణ నేతలు ప్రకాశ్ గౌడ్, గంగుల కమలాకర్, కేఎస్ రత్నం ధర్మాబాద్ కోర్టుకు హజరవుతున్నట్లు సమాచారం. బాబ్లీ కేసులో చంద్రబాబుతో సహా 15 మందికి మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
పెండింగ్లో ఉన్న నాన్ బెయిల్ వారెంట్లో ఈనెల 21న ధర్మాబాద్ కోర్టుకు హాజరుకావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. గోదావరి పై మహరాష్ట్ర నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010 సంవత్సరంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నేతృత్వంలో 40మంది ఎమ్మెల్యేలు బాబ్లీ సందర్శనకు వెళ్లారు. ఎత్తిపోతల పధకాల నిర్మాణాలు చేపట్టడం వల్ల గోదావరిలో నీటి ప్రవాహం తగ్గి, ఉత్తర తెలంగాణా ఎడారిగా మారుతుందని తెలుగుదేశం ఆందోళన చేపట్టింది.
విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకోవడం, 144సెక్షన్ ను అమలులో ఉన్నా పట్టించుకోకపోవడం, వంటి కారణలతో చంద్రబాబు పై కేసు నమోదయ్యాయి. ఇటీవలే చంద్రబాబు కోర్టుకు హజరుకాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీనికి సంబంధించి చంద్రబాబు పార్టీ నేతలు, న్యాయవాదులో తర్జనభర్జనలు సాగించారు. ఈ నెల 22న ఐక్యరాజ్యసమితిలో పాల్గొనే అరుదైన అవకాశం ఉన్నందున తన బదులు న్యాయవాదులను కోర్టుకు పంపాలని చంద్రబాబు నిర్ణయించారు.