ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి రోజు రోజుకీ దిగజారి పోతుంది. ఆదాయం పెరగటం లేదు, ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఖర్చులు కోసం అప్పులు పెరుగుతున్నాయి. పోనీ ఆ ఖర్చులు మన ఆదాయాన్ని పెంచే మార్గాలా అంటే కాదు. ఆ అప్పులు మన ఆస్తులు పెంచే మార్గాలా అంటే కాదు. మరి ఆ అప్పులు దేనికి ? ఓటు బ్యాంకు కోసం. ఉచిత పధకాల కోసం. ఇవి అయినా సరిగ్గా అందుతున్నాయా, ప్రజలు జీవితాలు సంతోషంగా ఉన్నాయా అంటే అదీ లేదు. మన ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక లెక్కలు చూస్తే, ఆర్ధిక శాస్త్రం మీద కనీస అవగాన ఉన్న వారు కూడా, రేపు వచ్చే ఉపద్రవం తలుచుకుని భయపడుతున్నారు. పాలకులు మాత్రం, రెండేళ్ళు అయినా, తమ పంధా మార్చుకోవటం లేదు. అభివృద్ధి వైపు, పెట్టుబడులు వైపు అడుగులు వేయటం లేదు. ఫిబ్రవరి 2021 చివరి వరకు, కాగ్ రిపోర్ట్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి ఎలా ఉందో వివరిస్తూ చెప్పుకొచ్చింది. ఈ ఆర్ధిక సంవత్సరం, ఫిబ్రవరి 2021 చివరి వరకు మన రాష్ట్ర అప్పులు 79000 కోట్లుకు చేరుకున్నాయి. గత ఏడాది 63 వేల కోట్ల అప్పు అయ్యింది. అంటే మన పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఇక ఫిబ్రవరి 2021 వరకు జరిగిన టాక్స్ కలెక్షన్ 68000 కోట్లు. అంటే, ఆదాయానికి మించి అప్పులు చేస్తున్నాం. ఈ పరిస్థితి ఎక్కడకు వెళ్తుందో తెలియదు.
ఇక ఇదే లెక్కలు ఫిబ్రవరి 2019 తో పోల్చి చూస్తే, ఇప్పుడు మనం ఎంత వేగంగా పతనం వైపు వెళ్తున్నామో అర్ధం అవుతుంది. ఫిబ్రవరి 2019 అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం. అప్పట్లో ఫిబ్రవరి 2019 వరకు 78000 కోట్లు టాక్స్ కలెక్షన్ జరిగితే, ఇప్పుడు 68000 కోట్లు మాత్రమే జరిగింది. సంవత్సరం సంవత్సరం టాక్స్ కలెక్షన్ పెరుగుతూ వెళ్తుంది, కానీ మనకు బాగా తగ్గింది. రెండు సంవత్సరాలలో 14 శాతం ఆదాయం పడిపోవటం అంటే, మన పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇక అప్పులు విషయానికి వస్తే, ఫిబ్రవరి 2019 వరకు 47000 కోట్లు అప్పు చేస్తే, ఇప్పుడు 79000 కోట్లు చేశారు. అంటే 32000 కోట్లు ఎక్కువ అప్పు చేశారు. ఇక మరో విషయం. జగన్ మోహన్ రెడ్డి గారు, నేను మద్య నిషేధం చేస్తాను, ఇది నా నవరత్నంలో ఒక రత్నం, మాట తప్పను మడమ తిప్పను అని చెప్తూ ఉంటారు. అయితే, ఇక్కడ లెక్కలు చూస్తే, ఎంత పచ్చి మోసం చేస్తున్నారో అర్ధం అవుతుంది. ఫిబ్రవరి 2019 వరకు, 5 వేల కోట్లు లిక్కర్ ఆదాయం ఉంటే, జగన్ గారి హయాంలో, ఫిబ్రవరి 2021 చివరి వరకు, 10 వేల కోట్ల లిక్కర్ ఆదాయం వచ్చింది. అంటే డబుల్ అయ్యింది. దీన్ని మద్య నిషేధం అంటారా ? పేదల రక్తాన్ని పీల్చుకుని తాగటం అంటారా ?