ఆంధ్రప్రదేశ్లో ఎన్నికైన నూతన ఎమ్మెల్యేలలో 55 శాతం మంది నేరచరితులు ఉన్నట్లు ఎన్నికల నిఘావేదిక రాష్ట్రసమన్వయకర్త డాక్టర్ పీసీ.సాయిబాబు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వారిలో 32 శాతం మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. పార్టీల వారీగా చూస్తే వైసీపీలో 86 శాతం మంది, టీడీపీలో 39 శాతం మంది నేరచరితులుగా ఉన్నారన్నారు. జనసేన నుంచి ఎన్నికైన ఒక శాసనసభ్యుడు కూడా నేరారోపణలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. నూతన శాసనసభ్యులలో 94 శాతం మంది కోటీశ్వర్లుగా ఉన్నారన్నారు. వైసీపీ శాసనసభ్యులలో 93 శాతం మంది, టీడీపీలో 96శాతం మంది కోటీశ్వర్లు కాగా జనసేన ఎమ్మెల్యే కూడా కోటీశ్వరుడే అన్నారు. శాసనసభ్యుల సగటు ఆస్తి రూ.27.87 కోట్లు కాగా వారిలో వైసీపీ వారి సగటు రూ.22.41 కోట్లు, టీడీపీ వారి సగటు రూ.66.41 కోట్లుగా ఉందన్నారు.
నూతన ఎమ్మెల్యేలలో 64 శాతం మంది గ్రాడుయేట్లు కాగా 34 శాతం మంది 5 నుంచి 12వ తరగతి వరకు చదువుకున్నవారు ఉన్నారన్నారు. ఇక లోక్ సభ విషయానికి వస్తే, లోక్సభ కు ఎన్నికైన ఎంపీల్లో సుమారు 50% మందికి నేర చరిత్ర ఉన్నట్లు వారు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం తెలుస్తోంది. ఎన్నికల నామినేషన్ దాఖలు చేసే సమయంలో వారు తెలిపిన వివరాల ప్రకారం వీటిని విశ్లేషించారు. కొత్తగా ఎన్నికైన 539 మంది ఎంపీల్లో 233 మందిపై వివిధ సెక్షన్ల ప్రకారం కేసులున్నాయి. 2009 లోక్ సభ కంటే ఇది 44% ఎక్కువ కావడం గమనార్హం. కేరళలోని ఇడుక్కి నియోజక వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ డీన్ కురియాకోసేపై 204 కేసులున్నట్లు ఆయన తన నామినేషన్లో పేర్కొన్నారు.
2014 ఎన్నికల్లో గెలిచిన ఎంపీల్లో 185 మందిపై కేసులున్నట్లు వెల్లడి కాగా.. ఇక 2009లో 162 మందిపై క్రిమినల్ కేసులున్నట్లు వెల్లడైంది. కొత్త ఎంపీల్లో 159 మంది(29శాతం)పై తీవ్ర నేర కేసులున్నాయి. వీటిలో అత్యాచారం, హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళా వేధింపులు తదితరాలున్నాయి. 2014లో 112(21%)మందిపై తీవ్ర నేర కేసులున్నాయి. 2009లో 76(14%) మంది ఎంపీలపై తీవ్ర నేర కేసులున్నాయి. ఇక ఈ ఎంపీల్లో 10మంది దోషులుగాతేలిన వాళ్లున్నారు. 11మంది ఎంపీలు హత్య కేసుల్లో దోషులుగా ఉన్నారు. మరో 30 మంది విజేతలు హత్యా ప్రయత్నం కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. ఎన్డీయేకి చెందిన ఎంపీల్లో నేర చరిత్ర కలిగిన వాళ్లు అత్యధికంగా ఉన్నారు. భాజపా తరఫున గెలిచిన 303 మంది ఎంపీల్లో 116 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. కాంగ్రెస్కు చెందిన 29 మందిపై, డీఎంకేకి చెందిన 10 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులున్నాయి.