నవ్యాంధ్రప్రదేశ్ వడివడి అడుగులేస్తూ… ఉన్నత శిఖరాలను ఎక్కుతోంది. ఏ సంస్థ, ఏ రంగంలో సర్వే చేసినా, అందులో ఆంధ్రప్రదేశ్ టాప్ లో నిలుస్తుంది. నేడు భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో మొదటి స్థానం… ఇలా శక్తివంచన లేకుండా కృషి చేస్తుంటే నవ్యాంధ్ర ప్రదేశ్ కు గమ్యస్థానాలుగా నిర్ధేర్శించుకున్న 2022 నాటికి దేశంలో మూడో అగ్రగ్రామి రాష్ట్రం, 2029 నాటికి అగ్రగామి రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలోనే అత్యున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మరెంతో కాలం పట్టదు. ఉపాధి హామీ పథకాన్ని అమలు పరచడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. కూలీలకు పనిదినాల కల్పన, ఆస్తులు నిర్మించడం, ఎక్కువమందికి పని కల్పనలో ఏపీ తొలిస్థానంలో ఉంది. గురువారం నాటికి ఉపాధి హామీ పథకం డ్యాష్‌బోర్డులో కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న వివరాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.
2018-19లో ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రంలో 53,41,970 ఆస్తులను నిర్మించారు. ఈ విభాగంలో రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్, తర్వాత తెలంగాణ, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు వరుసగా ఉన్నాయి. పనిదినాల కల్పనలోనూ 3,76,66,634 పనిదినాలతో ఏపీ తొలిస్థానంలో నిలిచింది. ఛత్తీస్ గఢ్, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అలాగే, లబ్ధిదారుల సంఖ్యలోనూ 23,75,397 కుటుంబాలకు లబ్ధి చేకూర్చి ఏపీ మొదటిస్థానంలో నిలిచింది. ఈ కేటగిరిలో తెలంగాణ రెండోస్థానంలో నిలిచింది. వ్యక్తిగత కేటగిరి వర్కర్లలో ఏపీ మొదటి స్థానంలో ఉంది.
అయితే, క్రియాశీలక కూలీల విభాగంలో మాత్రం ఏపీ కాస్త వెనుకబడి 16వ స్థానంలోకి వెళ్లింది. ఏపీలో మొత్తం 1,75,23,477 మంది ఉపాధి హామీ కూలీలు ఉండగా, అందులో 45 శాతం... అంటే 8,58,265 మంది క్రియాశీలంగా పనిచేస్తున్నారు. 6 కేటగిరీలకు సంబంధించిన గణాంకాలను డ్యాష్‌బోర్డులో పేర్కొనగా అందులో నాలుగు కేటగిరీల్లో ఏపీ తొలి స్థానం ఉంది. అలాగే, ఏపీలో ఉపాధి హామీ పనులు బాగా జరుగుతున్నాయని కేంద్ర బృందం కితాబిచ్చింది. పనుల తనిఖీ నిమిత్తం కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ అధికారుల బృందం ఈ నెల 28 నుంచి 30 వరకు విశాఖపట్నం, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో పర్యటించింది. దేశంలోని మిగతా రాష్ర్టాల కంటే ఏపీలో పనుల తీరు మెరుగ్గా ఉందని కొనియాడారు. ఉపాధి నిధులతో వివిధ శాఖల అనుసంధానం ద్వారా చేస్తున్న అభివృద్ధి ప్రశంసనీయమన్నారు. గ్రామాలను పట్టణాలకు ధీటుగా తీర్చిదిద్దారని అభినంచారు.