నవ్యాంధ్రలో కీలక రంగాల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులంతా ఉమ్మడి రాష్ట్రంలో భాగంగా హైదరాబాద్లో పని చేసిన వారే. అక్కడ 15 నుంచి 30 ఏళ్లపాటు పని చేశారు. ఈ క్రమంలో అక్కడే ఇళ్లు, పొలాలు, స్థలాలు, ఫాంహౌ్సలు కొనుక్కున్నారు. కొందరికి బినామీల పేరుతో కూడా ఆస్తులు, వ్యాపారాలు ఉన్నాయి. ఆయా అధికారుల ఆస్తులు, వాటిలో లొసుగుల సమాచారాన్ని తెలంగాణ పెద్దలు బయటికి తీసినట్లు తెలుస్తోంది. వివాదాలు ఉండటం ఎంత సహజమో... లేని వివాదాలను సృష్టించడం అంత సులభం! ఈ సమాచారం తమ దగ్గరుందన్న విషయాన్ని నేరుగా కొందరు ఉన్నతాధికారులకే తెలిసేలా చేశారు. ఏపీ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తే... అంతే అనే సంకేతాలు పంపించారు. భాగ్యనగరంలో ఎంతోకొంత శాతం ఉల్లంఘనలు లేని నిర్మాణాలు భూతద్దం వేసి వెతికినా కనిపించవు. కానీ... పనికట్టుకుని ఏపీ డీజీపీ ఇంటి నిర్మాణం ఉల్లంఘనలపైనే అక్కడి అధికారుల దృష్టి పడింది.
ఉన్నట్టుండి ఇంటి ప్రహరీని కూల్చివేశారు కూడా! సదరు ఇంటి బయట ఉన్న ఉల్లంఘనలపై ముందుగానే సమాచారం సేకరించి... నేరుగా వెళ్లి గోడ కూలిస్తే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో... వైసీపీ నేత ద్వారా పిటిషన్ వేయించినట్లు చెబుతున్నారు. ‘డీజీపీ ఇంటి ప్రహరీనే కూల్చివేశాం. మీరొక లెక్క కాదు’ అని ఇతర అధికార గణానికి హెచ్చరిక పంపారు. ‘ఫలానా అధికారి తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నాడు’ అని వైసీపీ ఆరోపించడమే ఆలస్యం! హైదరాబాద్లో సదరు అధికారి చిట్టా బయటకు తీసి ‘ఇదిగో మీ పరిస్థితి’ అని హెచ్చరిస్తున్నట్లు తెలిసింది. అఖిల భారత సర్వీసు అధికారులు, ఇతర ఉన్నతాధికారులు తమపని తాము నిబంధనల ప్రకారం చేసుకుంటూ వెళతారు. రాజకీయ పక్షపాత ధోరణిని సాధారణంగా చూపించరు. ఎందుకంటే వారికి చాలా కెరీర్ ఉంటుంది. అది ముఖ్యం! అయితే ఒక రాష్ట్రం కేడర్లో ఉన్న అధికారులు ఆ రాష్ట్రాన్ని తన సొంతంగా భావించాలి.
ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలి. ఏపీ ఉన్నతాధికారులు కూడా అలాగే చేస్తున్నారు. కానీ... పొరుగు పెద్దల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో వారు తమపని తాము చేయలేకపోతున్నారు. ఇటీవల జరిగిన రెండు, మూడు వ్యవహారాల్లో... ఏపీలో ఉన్న అధికారులకు ఇలాంటి సంకేతాలే వెలువడ్డాయి. ఒకవైపు చంద్రబాబు ‘నువ్వా నేనా’ అన్నట్లుగా రాష్ట్రం కోసం కేసీఆర్ను ఢీకొంటుండగా... చంద్రబాబు వాదనను సమర్థించే వివరాలు బయటికి చెప్పొద్దు అని అధికారులకు హెచ్చరికలు వస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ పరిష్కరించుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. విద్యుత్తు బకాయిలు, ఉమ్మడి ఆస్తుల విభజన తదితర విషయాల్లో గట్టిగా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్రం ముందు, కోర్టుల్లో ఏపీ తరఫున బలమైన వాదన వినిపించాల్సిన బాధ్యత అధికారులదే. ఎవరి ప్రభుత్వమున్నప్పటికీ... రాజకీయ నాయకత్వం ఆ పని చేయలేదు. ప్రస్తుతం ఆయా అంశాలపైనా అధికారులు స్వేచ్ఛగా వ్యవహరించలేని పరిస్థితి ఏర్పడింది. ‘చంద్రబాబును రాజకీయంగా ఒంటరి చేయాలనుకుంటే వాళ్ల ఇష్టం. దాంతో మాకు సంబంధం లేదు. కానీ, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మా పని మమ్మల్ని చేసుకోనివ్వకుండా బెదిరిస్తుండటం దారుణం’ అని ఉన్నతాధికారులు వాపోతున్నారు.