కేరళ వరద బాధితుల సహాయార్థం ఏపీ పోలీసు శాఖ విరాళంగా ఒక రోజు వేతనం కేరళ వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఒకరోజు విరాళాన్ని ప్రకటించింది. కానిస్టేబుల్ నుంచి రాష్ట్ర డీజీపీ స్థాయి వరకు వివిధ హోదాలలో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది తమ ఒక రోజు వేతనాన్ని కేరళ వరద బాధితుల సహాయార్థం ఇవ్వడానికి అంగీకారం తెలిపారని డీజీపీ ఆర్పీ ఠాకూర్ సీఎం చంద్రబాబుకు తెలిపారు. ఈ మొత్తం సుమారు రూ. 8 కోట్లు వరకూ ఉంటుందన్నారు. ఆ మొత్తాన్ని త్వరలోనే ప్రభుత్వానికి అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు డీజీపీ ఆర్పీ ఠాకూర్ సచివాలయంలో కలిసి తెలిపారు. కేరళ ప్రభుత్వానికి విరాళాన్ని పంపుతున్న పోలీసు సిబ్బందిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు.
మరో పక్క, భారీ వర్షాలు, వరదల కారణంగా పెద్ద ఎత్తున నష్టపోయిన కేరళ వరద బాధితుల సహాయార్ధం ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మానవతా హృదయంతో ముందుకొచ్చారు. తమ ఒక్కరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. ఈ మొత్తం సుమారు రూ.3.25 కోట్ల మేర ఉంటుందని ఈ మేరకు సంస్థ వైస్‌ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.వి.సురేంద్రబాబు సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో వరదలు, తుఫాన్లు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించిన అనేక సందర్భాల్లో సంస్థ ఉద్యోగులు ఆపన్నులకు అండగా నిలిచి తమ ఔదార్యాన్ని చాటుకున్నారని ఆయన తెలిపారు.