వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పై కోడి కత్తితో, దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో, ఏపి పోలీసులు, జగన్ మోహన్ రెడ్డికి మూడు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఆయనకు మూడంచల బధ్రత ఇవ్వటంతో పాటు, ఈ మూడు పనులు కూడా జగన్ చెయ్యాలని, ఏపి పోలీస్ కోరింది. జగన్ పాదయాత్రలో ప్రభుత్వ సెక్యూరిటీ సిబ్బందితోపాటు సొంత అనుచరులు కూడా ఆయనకు రక్షణగా ఉంటుంటారు. అయితే వారిని దాటుకుని యాత్రలో తన దగ్గరికి వచ్చేవారికి జగన్ ముద్దులు పెట్టి, నెత్తిన చేతులు పెట్టి ఆశీర్వదిస్తుంటారు. అలాంటి వారిలో దాదాపు ఆయన అభిమానులు లేదా వైసీపీ వాళ్లు ఉంటారని పోలీసులు ఇన్నాళ్లుగా భావించారు. అయితే, విశాఖ విమానాశ్రయంలో గురువారం ఆయన అభిమాని చేసిన కత్తి దాడితో ఒక్కసారిగా పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు.
అలాంటి అతి సమీప కలయికలను, సెల్ఫీలను ఆయన పాదయాత్రలో ఇకముందు అనుమతించరాదని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటిదాకా సెక్యూరిటీ సిబ్బందితో ఆయన పాదయాత్రలకు రక్షణ కల్పిస్తుండగా, వారికి రోప్ పార్టీ, సివిల్ పోలీసులను జతచేసి..మూడు అంచెల్లో భద్రతా వలయం నిర్మించాలని నిశ్చయించినట్టు తెలిసింది. జగన్ అభిమాని ఆయన భుజంపై కోడికత్తితో దాడి చేసిన అనంతరం ఆయన పార్టీ నేతలతోపాటు బీజేపీ నేతలు వ్యవహరించిన తీరు, రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి ప్రభుత్వాన్ని కూల్చి రాష్ట్రపతి పాలన తీసుకొచ్చే కుట్ర జరుగుతోందన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకొన్నారు.
సేల్ఫీలు వద్దు, ఎవరిని పడితే వారికి ముద్దులు పెట్టద్దు, పలకరింపులన్నీ రోప్ ఇవతలి నుంచే ఉండేలా చర్యలు తీసుకోండి అంటూ, ఏపి పోలీసులు జగన్ ను కోరారు. అదే సందర్భంలో ఆయనకు బద్రత కూడా పెంచనున్నారు. జగన్ మోహన్ రెడ్డి ఏపి పోలీస్ మీద నమ్మకం లేదు అని చెప్పినా, అవన్నీ మాకు అనవసరం, రాజకీయ నాయకులు ఎన్నో అంటూ ఉంటారు, మా బాధ్యత మేము చేస్తాం, అందుకే దాడి జరిగిన తరువాత, జగన్ సెక్యూరిటీ పై సమీక్ష చేసి, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాం, బద్రత పెంచటం ఒక ఎత్తు, అలాగే జగన్ కూడా మా సూచనలు పాటించాలి అని, పోలీసు ఉన్నతాధికారులు అంటున్నారు. తమ పరిధిలో జరగని దానికి తాము నిందలు అనుభవిస్తున్నామని, ఒక వేళ పాదయాత్రలో ముద్దులు, సెల్ఫీల కోసం వచ్చేవారు ఎవరైనా దాడి చేసి ఉంటే ఇంకెన్ని అనేవారోనన్న భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్, కన్నా లక్ష్మీనారయణకు కూడా సెక్యూరిటీ పెంచనున్నారు.