ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సాఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో జరిగిన దాడి కేసు విచారణలో ఏపీ పోలీసులు కీలకమైన అడుగు వేశారు. జగన్ వాంగ్మూలం కోరుతూ ఆయనకు రెండోసారి లేఖ పంపించారు. వాంగ్మూలం ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని లేఖలో జగన్‌ను కోరారు. అయితే జగన్ ఇచ్చే సమాధానాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలని పోలీసులు యోచిస్తున్నారు. ఇదిలావుండగా, దాడి అనంతరం వాంగ్మూలం కావాలంటూ ఏపీ పోలీసులు హైదరాబాద్ వెళ్లగా జగన్ తిరస్కరించారు. వాంగ్మూలం ఇవ్వబోరంటూ సజ్జల రామకృష్ణా రెడ్డి లిఖిత పూర్వకంగా చెప్పిన సంగతి తెలిసిందే.
మరో పక్క దాడి ఘటనపై ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ ప్రభుత్వ వైఫల్యం వల్ల దాడి జరిగిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. తన హత్యకు కుట్ర జరిగిందని, కేంద్ర దర్యాప్తు సంస్థతో ఈ ఘటనపై విచారణ చేయించాలని కోర్టును జగన్ కోరారు. ఈ పిటిషన్ గురువారం విచారణకు రానుంది. ఈ కేసులో ప్రతివాదిగా చంద్రబాబు పేరును జగన్ చేర్చడం గమనార్హం. ప్రభుత్వం కేసును తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తోందని జగన్ పిటిషన్‌లో పేర్కొన్నారు.
తాను మీ అభిమానని మీతో సెల్పీ దిగాలని చెప్పి జగన్‌పై శ్రీనివాసరావు అనే వ్యక్తి కోడి కత్తి దాడి చేసిన విషయం తెలిసిందే. దాడి జరిగిన వెంటనే జగన్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉలిక్కిపడ్డారు. వెంటనే శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. అతడి చేతి నుంచి కత్తి లాక్కున్నారు. శ్రీనివాసరావును విమానాశ్రయంలో భద్రతను పర్యవేక్షించే సీఐఎస్‌ఎఫ్ జవాన్లకు అప్పగించారు. వాళ్లు శ్రీనివాసరావును మరో గదిలోకి తీసుకెళ్లారు. సీఐఎస్‌ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ దినేశ్ కుమార్ ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా శ్రీనివాసరావుపై 307 ఐపీసీ (హత్యాయత్నం) కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.