Sidebar

06
Tue, May

ఆంధ్రప్రదేశ్ లో నెల కొన్న తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి సారించారా? రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఉభయ రాష్ట్రాల గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ ప్రధాని మోడీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు వివరించారా? ప్రధానితో తెలంగాణ సీఎం కేసీఆర్‌ గంటపాటు సాగిన ప్రత్యేక భేటీలో ప్రస్తావనకు వచ్చిన అంశాలేంటి? అసలు గవర్నర్‌ హుటాహుటిన హస్తినకు ఎందుకు వెళ్ళారు? తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రధానిమంత్రి కార్యాలయం ఇచ్చిన అపాయింట్‌ మెంట్‌ మేరకు గురువారం ప్రత్యేక విమానంలో ఢిల్లి వెళ్ళారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని తీసుకుని కేసీఆర్‌ ప్రధానిని కలిశారు. ఏకాంతంగా 55 నిమిషాల పాటు చర్చలు సాగించారు. ఇదే సమయంలో గవర్నర్‌ నరసింహన్‌, హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ అయ్యారు. ఒకేరోజు వివిధ సమయాల్లో కేసీఆర్‌, గవర్నర్లు ప్రధాని, రాజ్‌నాథ్‌ సింగ్‌తో సమావేశం కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.

modi kcr 16062018 2

తన ఢిల్లి పర్యటనకు సంబంధించిన అంశాలను మీడియా ప్రతినిధులు గవర్నర్‌తో ఆరా తీయగా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఢిల్లిలో కేసీఆర్‌, గవ ర్నర్‌ ప్రధాని, రాజ్‌నాథ్‌ సింగ్‌లతో సమావేశమైన సమయం లోనే ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిలో పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఢిల్లిలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఆరా తీశారు. ఈనెల 17వ తేదీన రాష్ట్రపతి భవన్‌లో జరగనున్న నీతి ఆయోగ్‌ సమావేశంలో చర్చించే అంశాలను ఖరారు చేసేందుకు చంద్రబాబు మంత్రులు, అధికారులతో భేటీ అయ్యారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఢిల్లి లో ఏదో జరుగుతోందంటూ ఏపీ తెదేపా నేతలు అనుమానం వ్యక్తం చేయడంతో పాటు భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, వైకాపాకు చెందిన పత్తికొండ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఇరువురు కలిసి గురువారం భాజపా అగ్ర నేతలతో సమావేశమయ్యారని ఈ సమావేశానికి కొనసాగింపుగానే గవర్నర్‌ నరసింహన్‌ హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు.

modi kcr 16062018 3

కేంద్ర ప్రభుత్వ వైఖరిని రాష్ట్ర ప్రజలు ఎండగట్టాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్‌ హస్తిన పర్యటనకు వెళ్ళడం తీవ్ర చర్చనీ యాంశమైంది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో సుదీర్ఘంగా సమావేశం కావడం, ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను వివరించడం బట్టి చూస్తుంటే కేంద్రంలో ఏదో జరగబోతోందన్న సంకేతాలు వెలువడుతు న్నాయని తెదేపా సీనియర్‌ నేత ఒకరు వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ ఢిల్లి పర్యటనకు ఒకరోజు ముందు బుధవారం రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్‌తో గంటకుపైగా సమావేశం కావడం వెనకగల కారణాలను విశ్లేషించే పనిలో ఆయా పార్టీల నేతలు నిమగ్నమయ్యారు. ఢిల్లిలో ప్రధానితో కేసీఆర్‌ భేటీ అయిన సందర్భంగా తృతీయ ఫ్రంట్‌పై కూడా చర్చ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. సాధారణంగా ప్రధానితో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా 20 నుంచి అరగంట పాటు సమావేశమవుతారని అయితే కేసీఆర్‌తో దాదాపు గంటపాటు మోడీ సమావేశం కావడంతో రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్టు భావిస్తున్నారు. చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని ప్రధాని మోడీ పావులు కదుపుతున్నారా? ఏపీలోని పరిస్థితు లపై ఆయన కేసీఆర్‌తో ఆరా తీశారా? అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారా? వచ్చే ఎన్నికల్లో ఏపీలో పరిస్థితిపై ఆయన సమాచారం సేకరించినట్టు కథనాలు వెలువడు తున్నాయి. ఒకేరోజున కేసీఆర్‌, గవర్నర్‌ నరసిం హన్‌లు హస్తినలో సుడిగాలి పర్యటనలు చేయడంతో జాతీయ మీడియా కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read