తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్కు బహిరంగంగా మద్దతిచ్చిన వైసీపీ మారుతున్న పరిణామాలతో మరో సెల్ఫ్ గోల్ చేసుకున్నామా అని మదనపడుతోంది. తెలంగాణలో వైసీపీ నేరుగా టీఆర్ఎస్కు మద్దతిచ్చింది. ఆ పార్టీకి చెందిన ప్రధాన మీడియా, సోషల్ మీడియా విభాగం కూడా కొన్నాళ్ల పాటు టీఆర్ఎస్ కోసమే పని చేసింది. కూకట్ పల్లి లాంటి నియోజకవర్గాల్లో.. టీఆర్ఎస్ కు మద్దతుగా.. వైసీపీ కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు. అందుకే గెలిచిన తర్వాత మాధవరం కృష్ణారావు .. జగన్మోహన్ రెడ్డి మీడియా ముఖంగా కృతజ్ఞతలు తెలిపారు. దానికి తగ్గట్లుగానే టీఆర్ఎస్ గెలవగానే.. ఏపీలోని వైసీపీ శ్రేణులు ఫ్లెక్సీలు పెట్టుకుని.. కేకులు కట్ చేసుకుని సంబరాలు చేసుకున్నారు. టీఆర్ఎస్ విజయాన్ని జగన్ విజయంగా వైసీపీ కార్యకర్తలు భావించారు. అంత వరకూ బాగానే ఉన్నా.. ఇలా మద్దతు ఇవ్వడం వల్ల జగన్ సాధించేమిటన్న విమర్శలు ప్రారంభమయ్యాయి.
ఏపీకి ప్రత్యేకహోదాను వ్యతిరేకిస్తున్న కేసీఆర్ విజయంతో ఎలా వేడుకలు చేసుకుంటారని టీడీపీ నేతలు విమర్శలు ప్రారంభించారు. అదే సమయంలో ప్రజల్లో కూడా.. వైసీపీ తీరుపై చర్చ ప్రారంభమయింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా తాము ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామని ప్రకటించడంతో.. వైసీపీకి తాము చేసిన తప్పు అర్థమయిందన్న ప్రచారం జరుగుతోంది. వెంటనే బొత్స లాంటి నేతలు.. తమకు టీఆర్ఎస్ తో సంబంధం ఏమిటని.. మీడియా మందుకు వచ్చి చెప్పడం ప్రారంభించారు. అదే సమయంలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ .. ఏపీకి వస్తా.. జగన్కు మద్దతిస్తానంటూ.. చేసిన ప్రకటన.. వైసీపీకి మరిన్ని ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి. దీనిపై టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. వరుసగా.. పొరుగు రాష్ట్రం నుంచి పార్టీలు దండయాత్రలా వచ్చి.. జగన్ కు మద్దతిస్తే.. ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని వారు బాధపడుతున్నారు. వారి మద్దతు వల్ల లాభం కన్నా ఎక్కువగా నష్టం జరుగుతుందని భావిస్తున్నారు. అందుకే.. వైసీపీ నేతలు ఎక్కువగా స్పందించకుండా.. సంయమనం పాటిస్తున్నారు.
ఏపీ రాజకీయాల్లో టీఆర్ఎస్ ఎలాంటి పాత్ర పోషిస్తుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నేరుగా పోటీ చేసినా లేకపోతే.. జగన్ లేదా పవన్ లకు మద్దతిచ్చినా.. అదో సెంటిమెంట్ తరహా అస్త్రంగా టీడీపీ చేతికి చిక్కే అవకాశం ఉంది. అందుకే.. తెలంగాణ ఎపెక్ట్ ఏపీ రాజకీయాల్లో కీలకం కానుంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో .. కాంగ్రెస్ తో పొత్త పెట్టుకుని 13 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటున్న కేసీఆర్ మాటల వెనుక అర్థం ఎన్నికల్లో పోటీ చేయడమేనని కొంత మంది చెబుతున్నారు. కానీ టీఆర్ఎస్ వైపు నుంచి ఈ విషయంలో క్లారిటీ లేదు కానీ వైసీపీ వర్గాలు టెన్షన్ పడుతున్నాయి. తెలంగాణలో మాదిరి.. చంద్రబాబు వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా.. ఏపీ ఎన్నికల ఎజెండా మారితే.. తాము సైడైపోవాల్సి వస్తుందనేది ఆ భయం. ఏ విధంగా చూసినా ఏపీలో జరగనున్న ఎన్నికల్లో తెలంగాణ ఎఫెక్ట్ కానుందని అంచనా వేస్తున్నారు.