కాపు రిజర్వేషన్ల అంశం పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, 5 శాతం రిజర్వేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే... జస్టిస్ మంజునాథన్ తో కమిషన్ వేసి, ఆ కమిషన్ సూచనలు ప్రకారం, నిర్ణయం తీసుకుంటూ, డిసెంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది... వెంటనే, బిల్లు రూపంలో అసెంబ్లీలో కూడా పెట్టింది... ఈ బిల్లు అసెంబ్లీలో కూడా ఆమోదం పొంది, కేంద్రానికి వెళ్ళింది... అంతకంటే ముందు, ఈ బిల్లు గోవర్నర్ వద్ద కూడా ఆమోదం పొందింది... ఇప్పుడు కేంద్రం పరిధిలో ఈ బిల్లు ఉంది... కేంద్ర హోంశాఖ వద్దకు ఈ బిల్లు చేరింది... అక్కడ నుంచి వివిధ మంత్రిత్వ శాఖలకు, ఈ బిల్ వెళ్ళింది. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ, ఈ కాపు కోటా పై అభ్యంతరాలను తెలిపింది.
ఇది సాకుగా చూపి కేంద్రం కూడా ఆట ఆడిస్తాం మొదలు పెట్టింది... మొత్తం రిజర్వేషన్లు 50 శా తం మించవద్దని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేసింది... అయితే, ఈ విషయం పై శుక్రవారం ఢిల్లీలోని నార్త్‌బ్లాక్ కార్యాలయంలో కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి సత్‌పాల్ చౌహాన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ భేటీలో ఏపీ తరఫున బీసీ కమిషన్ సభ్యుడు వీ.సుబ్రహ్మణ్యం, సీఐడీ డీజీ తిరుమలరావు, ఏపీ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ పాల్గొన్నారు. సామాజిక, ఆర్థిక పరిస్థితుల ఆధారంగానే కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రానికి వివరించారు.
బీసీ కమిషన్ కూడా దీనిని సమర్థించిందని చెప్పారు. ఆ కమిషన్ రిపోర్ట్ ఆధారంగానే, రిజర్వేషన్ ఇచ్చినట్టు చెప్పారు.. ఈ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది, రాష్ట్రపతి కూడా ఆమోదించాలా చూడండి అంటూ కేంద్రంలో హోమ శాఖ అధికారులని కోరింది ఏపి ప్రభుత్వం. అయితే, ఈ వాదనలను, సహేతుకమైన కారణాలను లిఖితపూర్వకంగా అందించాలని హోం శాఖ అదనపు కార్యదర్శి సత్‌పాల్ చౌహాన్ సూచించారు. కాపు రిజర్వేషన్ బిల్లుతో పాటు, భూసేకరణ చట్ట సవరణ బిల్లు, పబ్లిక్ డిపాజిటర్ల పరిరక్షణ బిల్లు, విద్యుచ్ఛక్తి సుంకం చట్టం కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్నాయని, ఇప్పటికే రాష్ట్రపతి ఆమోదించిన గుజరాత్, తెలంగాణ భూసేకరణ చట్ట సవరణ బిల్లుల్లో పేర్కొన్న పదాలనే తామూ వినియోగించామని, అయినా ఆ బిల్లు ఎందుకు పెండింగ్ లో పెడుతున్నారని, అది కూడా క్లియర్ చెయ్యమని రాష్ట్ర అధికారులు, కేంద్రాన్ని అడిగారు.