వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న కేరళ ప్రజానీకాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు మూడు లారీల్లో 51 మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం (బాయిల్డ్ రైస్) పంపించారు. మంగళవారం రాత్రి సచివాలయం బ్లాక్ వన్ ముందు లారీలకు పచ్చజెండా ఊపి లారీలను పంపించారు. ఇవి కాకుండా మరో 8 లారీల్లో 204 మెట్రిక్ టన్నుల బియ్యం ఈ రాత్రికే కేరళకు బయలుదేరుతున్నాయి. రూ.6 కోట్ల విలువైన 255 మెట్రిక్ టన్నుల బియ్యం పంపించారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ తరఫున ఈ బియ్యం కేరళ వరద బాధితుల సహాయార్థం పంపించారు. కేరళలోని ఎర్నాకులం ప్రాంతానికి బియ్యం రవాణా చేసి అక్కడ దిగుమతి చేసి ఆ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులకు అప్పగిస్తామని జాయింట్ కలెక్టర్ విజయకృష్ణన్, డిఎస్ఓ జె.నాగేశ్వరరావు తెలిపారు.
ప్రకృతి వైపరీత్యం కారణంగా దెబ్బతిన్న కేరళకు రాష్ట్రం నుంచి 50 కోట్ల రూపాయల సహాయం అందనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఇప్పటికే 10 కోట్ల ఆర్ధిక సహాయాన్ని ప్రకటిచండం జరిగిందనీ, మరో 12 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందజేయనున్నట్లు సీఎం పేర్కొన్నారు. అదేవిధంగా ఏపీఎన్జీవోస్, పెన్షనర్లు నుంచి ఒక్క రోజు జీతం కింద 24 కోట్లు, పోలీసు వెల్ఫేర్ అసోసియేషన్ 7 కోట్లు ఆర్థిక సహాయం అందజేసేందుకు ముందుకొచ్చాయన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వారి నెల బేసిక్ వేతనం సుమారు 38 లక్షలు, ఎంపీ లాడ్స్ కింద 2.10 కోట్లు ఇవ్వనున్నట్లు సీఎం వివరించారు.
రాష్ట్రం నుంచి 6 కోట్ల విలువచేసే బియ్యాన్ని కేరళకు పంపనున్నట్లు తెలిపారు. కేరళలో జరిగిన నష్టం జాతీయ విపత్తు లాంటిదని, ఎవరికి తోచిన విధంగా వారు మానవత్వంతో సహాయాన్ని అందించాలన్నారు. చేసిన సహాయం చెప్పడం సరికాకపోయినా పదిమందికి స్పూర్తినివ్వాలనే ఉద్దేశంతోనే చెబుతున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి కూడా కేరళకు హితోదిక సాయాన్ని అందజేస్తున్నారన్నారు. చిత్తూరు, కృష్ణా, ప్రకారం, నెల్లూరు, అనంతపురం జిల్లాల నుంచి బియ్యం, దుప్పట్లు, నిత్యావసర సరుకులను ఇప్పటికే కేరళ రాష్ట్రానికి ఆయా జిల్లాల్లోని స్వచ్ఛంధ సేవా సంస్థలు, అసోసియేషన్లు పంపడం జరిగిందన్నారు. కేరళలో వర్ష బీభత్స కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో సేవలందించేందు కు రాష్ట్రం నుంచి విద్యుత్, అగ్నిమాపక దళాలు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు వెళ్లాయన్నారు.