కేంద్రం పదే పదే పెడుతున్న ఇబ్బందులతో, రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ఎంపిక పై రాష్ట్రానికి, కేంద్రానికి దాదాపు యుద్ధమే నడుస్తుంది.. ఈ పరిణామాలు అన్నీ గమనించిన చంద్రబాబు ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్ డీజీపీగా వ్యవహరిస్తున్న నండూరి సాంబశివరావుకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.... దీనికి సంబంధించి జిఓ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ విడుదల చేశారు... డీజీపీ సాంబశివరావు విషయంలో కేంద్ర హోం శాఖ ఒంటెత్తు పోకడలు పోవడం ఆగ్రహం తెప్పించింది...
డీజీపీ నియామకం విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో రాష్ట్ర ప్రభుత్వం విసిగిపోయింది. ఇకపై రాష్ట్ర డీజీపీని కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే నియమించుకునేలా ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయించింది. లోగడ ప్రకాశ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి అనేక రాష్ట్రాలు యూపీఎస్సీ ఆధ్వర్యంలోని కమిటీ ద్వారా డీజీపీ ఎంపిక ప్రక్రియను చేపడుతున్నాయి. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక ఏపీ పోలీస్ యాక్ట్‌కు సవరణ చేసి యూపీఎస్సీ కమిటీ ద్వారానే డీజీపీ నియామకం జరగాలని క్లాజ్ చేర్చారు.
ప్యానెల్లో ఎవరి పేరు పెట్టాలో, ఎవరి పేరు పెట్టకూడదో కేంద్రమే నిర్ణయిస్తే ఎలా? రాష్ట్రం సూచించిన పేర్ల నుంచి ముగ్గురిని ఎంపిక చేయడమే యూపీఎస్సీ కమిటీ విధి. కేంద్ర హోం శాఖ దీనికి ససేమిరా అనడంతో రాష్ట్ర ప్రభుత్వం.. 2014లో తెచ్చిన పోలీస్ చట్టసవరణను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ మేరకు ఆర్డినెన్స్ జారీ చేయనున్నట్లు తెలిసింది. ఇదే జరిగితే.. ఇకపై డీజీపీ నియామకం పాత పద్ధతిలో రాష్ట్ర స్థాయిలోనే జరుగుతుంది. వారికి విధిగా రెండేళ్ల పదవి ఉండాలన్న నిబంధన ఉండదు. ఎప్పటిలాగే పదవీ విరమణ వయసు లేదా ప్రభుత్వ అభీష్టం మేరకు డీజీపీగా కొనసాగుతారు. పొరుగున ఉన్న కర్ణాటక తన డీజీపీని తానే నియమించుకుంటున్న నేపథ్యంలో అదే పంథాను ఏపీ అనుసరించాలని నిర్ణయించింది.