అమరావతి నగరానికి మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్టు ఆపరేటింగ్ సిస్టమ్ అందించే కృషిలో భాగస్వామిగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రముఖ ఆన్‌లైన్ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్‌వర్క్ కంపెనీ ‘ఓలా’కు సూచించారు. మంగళవారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి సమక్షంలో ఓలా గ్రూపుతో ఏపీటీడీసీ, ఏపీ టూరిజం డిపార్టుమెంట్ అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. రాష్ర్టంలో పెద్దఎత్తున జరుగుతున్న పర్యాటక రంగ అభివృద్ధికి ఈ ఎంవోయూలు కీలక భూమిక పోషించగలవన్న అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వ్యక్తంచేశారు.
పర్యాటకులు రావాలంటే సురక్షితమైన రవాణ వ్యవస్థ, సమర్ధులైన టూరింగ్, ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్ల అవసరం ఎంతో వుందని ముఖ్యమంత్రి అన్నారు. ఇండియా లార్జెస్ట్ క్యాబ్ ఆపరేటర్‌గా ఉన్న ‘ఓలా’ ఏపీలో ఇప్పటికే 6 నగరాలలో 6 వేల వాహనాలను నడుపుతుండటం విశేషమని, రానున్న కొద్దికాలంలో 3 మెగాసిటీలు, 13 కార్పొరేషన్ సిటీలలో ఈ సంస్థ నెట్‌వర్క్ పెంచుకోవాలని సూచించారు. అందుకు అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. ప్రయాణికుల్ని సురక్షితంగా గమ్యానికి చేర్చగలమన్న నమ్మకాన్ని అందించడం ఎంతో ముఖ్యమని, దీనికోసం సిబ్బందికి ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ, నైతిక ప్రవర్తన అవసరమని చెప్పారు. ఏపీలో పర్యాటకం అభివృద్ధికి టూరిస్టు ఆపరేటర్లు, క్యాబ్ ఆపరేటర్లు చేసే మార్కెటింగ్ కూడా కీలక పాత్ర వహిస్తుందని అన్నారు.
ప్రజారాజధానిలో సైకిలింగ్, ఎలక్ట్రికల్ ట్రాక్‌లతో పాటు సాధారణ మార్గాలు కూడా వుంటాయని, అన్ని మార్గాలకు అవసరమైన అధునాతన వాహన వ్యవస్థతో ముందుకురావాలని ముఖ్యమంత్రి ‘ఓలా’ క్యాబ్స్ నిర్వహించే ‘ఏఎన్ఐ టెక్నాలజీస్’ బృందానికి వివరించారు.
ప్రస్తుతం ఏపీలో 6 వేలుగా వున్న ఓలా వాహనాలు వచ్చే ఏడాదికి 12 వేలకు, రెండేళ్లలో 16వేలకు, ఐదేళ్లలోగా 25 వేలకు పెంచుతామని ఏఎన్ఐ యాజమాన్యం ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించింది. దీనివల్ల 20 వేల కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుందని చెప్పారు. మరో ఐదారు నగరాలకు విస్తరించడం ద్వారా ఏపీలో మొత్తం 12 నగరాలలో తాము అందుబాటులో వుంటామని తెలిపారు. టూరిజంతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా పర్యటక గమ్య స్థానాలకు, పండగలు, ఈవెంట్లు, సెలవు రోజులలో సరికొత్త ప్యాకేజీలు ప్రవేశపెడతామని చెప్పారు. అలాగే, ఓలా వాహనాలను ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగించుకుని ఏపీ టూరిజం ప్రమోషన్ చేయడానికి వీలవుతుందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఆశిస్తున్నట్టుగా రానున్న ఐదేళ్లలో మొత్తం 2 వేల ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకువస్తామని ప్రకటించారు.
ఈరోజు చేసుకున్న ఒప్పందాల మేరకు ఓలా కలిసి ప్రభుత్వం ఫెస్టివల్స్‌కు, హాలీడే సీజన్లకు ప్రత్యేక ప్యాకేజీలు తీసుకువస్తుంది. అన్ని మార్కెటింగ్ ప్రచారాల్లోనూ ‘ఓలా’ను అఫీషియల్ ట్రావెల్ పార్టనర్‌గా గుర్తిస్తుంది. ఓలా డ్రైవర్లకు అవసరమైన శిక్షణ అందించడంలో ప్రభుత్వం సహకరిస్తుంది. పర్యాటక రంగానికి చెందిన ప్రభుత్వ అధికార వెబ్ సైట్లలో ఓలా ఏపీఐని అనుసంధానం చేస్తారు. అక్కడి నుంచే నేరుగా కస్టమర్లు ఓలా వాహనాలను బుక్ చేసుకునే అవకాశం కలుగుతుంది. ఓలా సంస్థ కూడా ఇదే పద్దతిలో ఏపీ టూరిజాన్ని ప్రమోట్ చేస్తుంది. విజయవాడ ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషన్, నెహ్రూ బస్టేషన్ తదితర స్థానాల నుంచి వెలగపూడి సచివాలయం, కనకదుర్గ కోవెల, సీఆర్‌డీఏ కార్యాలయాలకు ఇకపై నిర్ధేశిత రుసుమునే వసూలు చేస్తుంది. రెండవ దశలో ఏపీలోని 5 ప్రధాన నగరాలలో ఎలక్ట్రిక్ బస్సులు, క్యాబ్స్ తదితర వాహనాలను ప్రవేశపెడుతుంది. ఏపీ టూరిజంతో కలిసి స్కిల్లింగ్, ఎంప్లాయిమెంట్ జనరేటింగ్ ప్లాట్‌ఫామ్ తీసుకురావడానికి కృషి చేస్తుంది. ఎంవోయూలు చేసుకున్న తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయ ఆవరణలోనే ‘ఓలా’ కొత్త వాహనాలకు పచ్చజెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.