ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార చిహ్నం మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార చిహ్నంలో ఇప్పటి వరకు ‘పూర్ణ కుంభం’ ఉండేది. అయితే, అది తప్పని ప్రభుత్వం తేల్చింది. ఎన్నో ఏళ్ళుగా అధికారులు, ప్రభుత్వాలు ఈ తప్పు చేస్తున్నాయని తెలుసుకుని, ఇప్పుడు సరిదిద్దారు. బుధవారం పంద్రాగస్టు సందర్భంగా, 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడి, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్గా ఆవిర్భవించినప్పుడు ఉన్న అసలు సిసలైన అధికార చిహ్నాన్ని తిరిగి తెరపైకి తెచ్చింది. నిజానికి అసలైన చిహ్నం మధ్యలో, 2500 సంవత్సరాల నాటి ‘అమరావతి’ బౌద్ధస్థూపంలోని ధర్మచక్రం, పూర్ణఘటంతో ఈ చిహ్నాన్ని సృష్టించారు. దీంతోపాటు సత్యమేవ జయతే, నాలుగు సింహాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... వంటి గుర్తులు, వాక్యాలతో ఇది తయారైంది.
అయితే, ఈ అధికారిక చిహ్నం రకరకాలుగా మార్పులకు గురైంది. మరీ ముఖ్యంగా... పూర్ణ ఘటాన్ని పూర్ణ కుంభంగా పొరబడటమే దీనికి ప్రధాన కారణం. దీనికి అనుగుణంగా మామిడి ఆకులను చేర్చారు. ఘటానికి చుట్టూ ఉన్న తామరపూలు, మొగ్గలను తీసేసి... ఒక పూర్తిస్థాయి పూర్ణకుంభాన్ని చిహ్నంలో పెట్టేశారు. రాష్ట్ర అధికార చిహ్నంలో జరిగిన మార్పుల గురించి కొందరు ప్రముఖులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై జీఏడీ ముఖ్య కార్యదర్శి శ్రీకాంత్ లోతుగా పరిశీలించారు. ఈమని శివనాగిరెడ్డి, ఇతర చారిత్రక నిపుణులతో చర్చించారు. అసలు ఈ చిహ్నానికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడింది, అందులో ఏముంది? అనే అంశంపై దృష్టి సారించారు.
ఈ నోటిఫికేషన్ ప్రతి హైదరాబాద్లోని పురాతత్త్వ విభాగంలో ఇది దొరికింది. దీనిని పరిశీలించగా... అమరావతి స్థూపం నుంచే అధికారిక చిహ్నం తీసుకున్నారని స్పష్టమైంది. అంతటితో ఆగకుండా... నిజమైన అమరావతి స్థూపంలో పూర్ణఘటం రూపాన్ని పరిశీలించాలని నిర్ణయించారు. లండన్ మ్యూజియం నుంచి దీనికి సంబంధించిన ఫొటోను తెప్పించారు. పురావస్తు, చారిత్రక నిపుణులతో చర్చించి... 1954నాటి నోటిఫికేషన్ ప్రకారం, అమరావతి సంస్కృతి నుంచి స్వీకరించిన పూర్ణఘటాన్ని తిరిగి అధికారిక చిహ్నంలో చేర్చాలని నిర్ణయించారు. దీని ప్రకారం... ధర్మచక్రంలో 64 గీతలు, పూర్ణ ఘటం చిత్రాన్ని చేర్చారు. నాలుగు సింహాల బొమ్మను అలాగే ఉంచారు. అదే సమయంలో గతంలో అధికార చిహ్నం పైభాగాన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని ఆంగ్లంలో ఉండేది. ఇప్పుడు దాన్ని తెలుగులోకి మార్చారు. ఆంగ్లంలో కిందివైపు ముద్రించారు. సత్యమేవ జయతే అన్న సూక్తిని కూడా తెలుగులోకి మార్చి ముద్రించారు.