రోడ్డున పడేసిన రాష్ట్రానికి న్యాయం చేస్తాను అంటూ, నమ్మించి మోసం చేసి, తిరుమల వెంకన్న పాదాల చెంత హామీలు ఇచ్చి, ఏపి ప్రజలను గాలికి వదిలేసి, మన రాష్ట్రానికి చేసిన అన్యాయం ఖరీదు, అక్షరాలా రూ.90,283 కోట్లు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో రాజ్యసభలో ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఇచ్చిన హామీల మేరకు ఈ మొత్తం నిధులు విడుదల చేయాల్సి ఉందని తెలిపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం శ్వేతపత్రం విడుదల చేశారు. ‘పునర్విభజన చట్టంలో 14 విభాగాలుగా హామీలు ఇవ్వగా.. అందులో 9 అమలుచేయలేదు. ఐదింటిని పాక్షికంగా అమలుచేశారు. పార్లమెంటు వేదికగా అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో.. ప్రత్యేక హోదా, పన్ను ప్రోత్సాహకాలు, ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ, పోలవరం, సిబ్బంది, ఆస్తులూ అప్పులూ పంపిణీ, వనరుల అంతరం భర్తీపై ఆరు హామీలిచ్చారు. అందులో ప్రత్యేక హోదాకు అతీగతీ లేదు. మిగతా ఐదూ పాక్షికంగా అమలు చేశారు’ అని అందులో పేర్కొన్నారు.
హామీలు, చట్టంలోని అంశాలు, ప్రతిపాదనల ప్రకారం వనరుల లోటుగా రూ. 12,099.26 కోట్లు, కొత్త రాజధాని నిర్మాణానికి రూ. 38,437 కోట్లు, ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీగా రూ. 23,300 కోట్లు, ప్రత్యేక కేటగిరీ హోదా కింద ఐదేళ్లకు 60శాతానికి బదులు 90శాతం వాటాలో వ్యత్యాసం రూ. 16,447 కోట్లు వెరసి రూ. 90,283.26 కోట్లు కేంద్రం విడుదల చేయలేదు. ఇన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ నాయకులు, అధికారులు, ఉద్యోగుల కఠోర శ్రమ, ప్రజల భాగస్వామ్యంతో నాలుగున్నరేళ్లలో రాష్ట్రం ప్రగతి సాధించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి 54 కీలక కేంద్ర ప్రతిపాదిత, కేంద్ర రంగ పథకాలలో ఏపీ పనితీరు ఈ ఏడాది నవంబర్ వరకు 14 పథకాల్లో మొదటి ర్యాంక్, మరో 28 పథకాల అమలులో 2 నుండి 5 ర్యాంకులు, 4 పథకాల్లో 6 నుండి 10 ర్యాంకులు సాధించినట్టు శే్వతపత్రంలో వివరించారు.
విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలో ఉన్న సంస్థ ఆస్తుల విలువ రూ.1,97,280 కోట్లు. కేంద్రం నిర్లక్ష్యం కారణంగా ఈ సంస్థల ఆస్తులు, అప్పులను విభజించలేదు. పదో షెడ్యూల్లో 142 సంస్థలు ఉండగా వాటినీ విభజించలేదదు. వీటి ఆస్తుల విలువ రూ.38,772.85 కోట్లు. రాష్ట్రానికి వరప్రదాయిని పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు 2013 నాటి చట్టం ప్రకారం భూసేకరణ, సహాయ, పునరావాస కార్యక్రమాలతో పాటు పెరిగిన అంచనాలకు అనుగుణంగా రూ.57,940.86 కోట్లకు సవరించిన అంచనాలను కేంద్రానికి సమర్పించాం. ఇప్పటివరకు ఆమోదించలేదు. రాష్ట్రప్రభుత్వం ఖర్చు చేసిన రూ.3,342.4 కోట్లను ఇంకా రీయింబర్స్ చేయలేదు. ఏపీ జెన్‌కోకు తెలంగాణ డిస్కంలు రూ.5,732.4 కోట్ల బకాయిలున్నాయి. 2014 నాటికి ఉన్న ఈ బకాయిల వసూళ్లపై కేంద్రం ఇప్పటివరకు పరిష్కరించలేదు. గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం ఏర్పాటు, అసెంబ్లీ సీట్ల పెంపు, ఢిల్లీ ఏపీభవన్ ఆస్తుల విభజన, పన్ను బకాయులు, రుణాలు, రీఫండ్‌ల కేటాయింపు కూడా చేయలేదు.