రాష్ట్ర రవాణా వ్యవస్థలో ఏపీ ప్రభుత్వం కీలక మార్పు తీసుకువచ్చింది. ఏపీ రవాణా వ్యవస్థలో ఇక నుంచి ఒకే రాష్ట్రం....ఒకే కోడ్ విధానం అమలులోకి రానుంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చామని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఇక నుంచి రాష్ట్రంలో వాహనాలకు ఒకే కోడ్ ఉంటుందని, జిల్లాలకు ప్రత్యేక కోడ్ ఉండదని స్పష్టం చేశారు. ఈ విధానంతో పాత వాహనాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన పేర్కొన్నారు. ఇక నుంచి రిజిస్ట్రేషన్ చేసుకునే వాహనాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే కోడ్ ఉంటుందన్నారు. ఏపీ 39 నంబర్‌తో ఏపీలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ఉంటుందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తం ఒకే కోడ్‌తో వాహనాల రిజిస్ట్రేషన్ జరుగుతుందని చెప్పారు.
కొత్త విధానంతో రెండున్నర రోజుల్లోనే అంకెల సిరీస్ మారిపోతుందని రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యం చెప్పారు. దీనివల్ల నెలలోనే 15సార్లు కొత్త సిరీస్ అంకెలు వస్తాయన్నారు. ఏపీ 39తో కొత్త సిరీస్ ప్రారంభిస్తామని, 15 రోజుల్లో ఈ విధానం అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. మరో పక్క, ఈ రోజు అమరావతిలో ఆదరణ-2 పథకం అమలును మంత్రి సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చేతివృత్తుల వారికి కోరుకున్న విధంగా అత్యాధునిక పనిముట్లు అందజేస్తున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. లబ్ధిదారులకు ప్రస్తుతం పనిముట్లపై 20 శాతం రుణమాఫీ అందజేస్తున్నామని వెల్లడించారు.
చేతివృత్తులు చేపట్టే వ్యక్తులు 10 శాతం కంట్రిబ్యూషన్ చెల్లిస్తే, మిగిలిన 90 శాతం భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కింద భరిస్తుందని పేర్కొన్నారు. ఆదరణ-2 పథకంలో భాగంగా తొలివిడతలో 2 లక్షల మందికి పనిముట్లను అందజేస్తామని మంత్రి తెలిపారు. ఈ పథకం కింద 5 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, నాలుగు లక్షల మంది ముందుకొచ్చారని వెల్లడించారు. వచ్చే నెల 12న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. ఆదరణ-2 పథకం రెండో దశను కూడా నవంబర్ లోనే ప్రారంభిస్తామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.