ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంస్థ రెడీమేడ్ వస్త్ర తయారీ రంగంలో దూసుకెళ్లడానికి సిద్ధమవుతోంది. హైదరాబాద్ లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ (నిఫ్ట్ ) చేనేత కళాకారుల కోసం 4 వేల వస్త్ర సంచయన నమూనాలను రూపొందించి ఇవ్వనుంది. శనివారం అమరావతి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో చేనేత రంగం పరిస్థితి, ఆప్కో సంస్థ కార్యకలాపాలను సమీక్షించారు. దేశ విదేశాల్లో ఆప్కో విక్రయ కేంద్రాలు, షోరూములను ప్రారంభించాలని, ఇందుకోసం అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

నాణ్యతతో రాజీపడకుండా మంచి ఉత్పత్తులను అందించి విశ్వసనీయతతో దేశవిదేశాల్లో వినియోగదారుల ఆదరణ పొందాలన్నారు. ట్రెండీ నమూనాలతో వినియోగదారుల అభిమానం పొందాలి. పోటీ ప్రపంచంలో దీటుగా నిలివాలని, మార్కెటింగ్‌ ఇప్పటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను కోరారు. ఆన్ లైన్ ద్వారా విక్రయాల ఆర్డర్లు తీసుకోవాలన్నారు. మన చేనేత కార్మికులు లక్షల ఖరీదైన నేత, పట్టు చీరలను తయారు చేస్తున్నారని, వారికి ఎన్నో నైపుణ్యాలున్నాయని, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని మరింత అద్భుతాలు సృష్టించవచ్చని ముఖ్యమంత్రి సూచించారు.

ఎగ్జిబిషన్లు నిర్వహించాలని, ఎగ్జిబిషన్లలో ఆప్కో విక్రయ కేంద్రాలు పెట్టాలలని ముఖ్యమంత్రి సూచించారు. ఆప్కో సంస్థ మనుగడకు, లాభాల బాటపట్టించడానికి దీర్ఘకాల, స్వల్పకాల ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఆదాయం సమకూర్చుకోవాలని, ఉపాధి కల్పించే సంస్థగా తయారు కావాలని అన్నారు.

సంక్రాంతిలాంటి పెద్ద పండుగల సందర్భంగా, వివిధ మతాల వారి పండుగల సమయంలో 25 నుంచి 30% రిబేటు ఇవ్వాలని, తగిన ఆకర్షణలు, బహుమతులతో వినియోగదారులను ఆకట్టుకుని మార్కెట్‌లో ఆప్కో స్థానం సుస్థిరం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.

మార్కెట్ ధోరణులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆకట్టుకునేలా సృజనాత్మకతతో కొత్త కొత్త డిజైన్లను సృష్టించాలని, ఇందుకు నిఫ్ట్ లాంటి సంస్థల సహకారం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.
జనరల్ సేల్స్ పెంచాలని, ఆకట్టుకునే రంగుల డిజైన్ వస్త్రాలను విక్రయించాలన్నారు. అన్ని జిల్లా కేంద్రాలలో, నగరపాలక కేంద్రాలలో హ్యాడ్ లూమ్ విక్రయ కేంద్రాలు, షోరూములు ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలని కోరారు. సొంతగా లేదా ఫ్రాంచైజీ తరహాలో విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయవచ్చని సీఎం అన్నారు. అన్ని రాష్ట్రాలలో చేనేత విక్రయాలు ఎలా ఉన్నాయో అధ్యయనం చేసి, మార్కెటింగ్‌కు మెరుగైన పద్ధతులు అనుసరించాలని కోరారు.

ఆప్కో విక్రయ కేంద్రాల్లో చేనేత వస్త్రాలే కాకుండా హస్తకళా వస్తువులు, వెండి, బంగారు ఇమిటేషన్ జువెలరీ, ఫ్యాన్సీ గాజులు, అలంకరణ సామగ్రి, తోలు కళా వస్తువులను విక్రయించాలని, తద్వారా షోరూముల నిర్వహణ ఖర్చులు రాబట్టవచ్చని సూచించారు. పోలీసు విభాగం, స్పెషల్ బెటాలియన్లు, నావికాదళ, వాయుసేన, సైన్యానికి ఆర్డర్లపై ఏకరూప దుస్తులకు వస్త్రాలను సరఫరా చేయాలని ఆప్కోను ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే రవాణా, అడవులు, వైద్య, ఆరోగ్యం, దేవాదయాశాఖ, టిటిడి, భారతీయ రైల్వేలు, ప్రభుత్వం నిర్వహించే సంస్థలు, శిక్షణా సంస్థలు ఆప్కో నుంచి ఆర్డర్లు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సంబంధిత శాఖలను ఆదేశించారు. జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, పాఠశాలల విద్యార్ధులకు ఏకరూప దుస్తులుగా ఆప్కో వస్త్రాలను సరఫరా చేయాలన్నారు.

నిఫ్టు సహకారంతో ఆప్కో డిజైన్ స్టుడియో
నిఫ్ట్ సహకారంతో ఆప్కో డిజైన్ స్టుడియో ఏర్పాటు చేయాలని, చేనేత సహకార సంఘాలకు నూలు పంపిణీకి యార్న్ బ్యాంక్ స్థాపించాలని ఆప్కో ప్రతిపాదించగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇ-కామర్స్ ద్వారా విక్రయాలు పెంచాలని, సోమవారాన్ని హ్యాండ్ లూమ్స్‌డే గా పాటించి ఆరోజు కార్పొరేట్ కంపెనీల్లో, విద్యాసంస్థల్లో అందరూ చేనేత వస్త్రాలు ధరించేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు.

ఏపీలో చేనేత రుణ ఉపశమనం రూ 71.39 కోట్లు
ఆంధ్రప్రదేశ్ లో చేనేతలకు రూ. 71.39 కోట్ల రుణ ఉపశమనం కల్పించామని, 22247 మంది లబ్ది పొందారని, వడ్డీ కింద చెల్లించాల్సిన బకాయిల మొత్తం రూ. 17 కోట్లు అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆప్కో 2017-18 లో ఆప్కో బిజినెస్ టర్నోవర్ లక్ష్యం రూ.338 కోట్ల అని, 2018-19 కి రూ.405 కోట్లు, 2019-2020 నాటికి రూ.486 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించామన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read