నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మంగళగిరి అభివృద్ధి సోపానంలో మరో మణిహారం చేరింది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) మంగళగిరిలో ఏపీఐఐసీ టవర్స్ బహుళ అంతస్తుల భవనాల్లో టవర్-1ప్రారంభానికి సిద్ధమైంది. అత్యంత ఎత్తైన బహుళ అంతస్తులు కలిగిన ఈ టవర్స్ మంగళగిరికే తలమానికంగా నిలుస్తోంది. 2.26 ఎకరాల విస్తీర్ణంలో రూ.110 కోట్ల వ్యయంతో 11 అంతస్తుల సర్వాంగ సుందరమైన భవనాన్ని అనేక ప్రత్యేకతల మేళవింపుతో ఏపీఐఐసీ ఈ టవర్స్‌ను అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసింది. పారిశ్రామిక విభాగాలన్నీ ఒకే చోట... మంగళగిరిలోని ఏపీఐఐసీ టవర్స్-1 భవనం నిర్మాణం పూర్తి కావడంతో పరిశ్రమలు, పెట్టుబడుల విభాగాలకు సంబంధించిన కార్యాలయాలన్నీ ఒకే గొడుకు కిందకు రానున్నాయి.
ఇప్పటిరకు ఈ విభాగాల కార్యాలయాలకు సొంత భవనాలు లేక విజయవాడలో పలు ప్రాంతాల్లో ఉండేవి. ఇప్పుడు ఏపీఐఐసీ టవర్స్ - భవనం పూర్తి కావడంతో ఇవన్నీ ఈ భవనంలోకి మారనున్నాయి. దీనివల్ల పరిశ్రమలకు సంబంధించి, పెట్టబడులకు సంబంధించి అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండటంతో ప్రజలకు ఎంతో సౌలభ్యం కలగనుంది. పెట్టుబుడులు పెట్టడానికి ముందుకు వచ్చేవారికి సర్వేసమస్త సమాచారం ఈ కార్యాలయంలో లభించేలా కూడా ఏర్పాట్లు చేశారు. ఏపీఐఐసీ, పరిశ్రమల శాఖ కమిషనర్, ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి (ఏపీఈడీబీ), ఏపీఐడీసీ మరియు ఏపీ ఫైబర్‌నెట్ సంస్థ కార్యాలయాలు కూడా ఇందులో కొలువుదీరనున్నాయి.
దీంతో పాటు ఈ భవనంలో ఐఓటీ ఎగ్జిబిషన్ కేంద్రాన్ని కూడా ప్రధాన ఆకర్షణగా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చేవారి కోసం సర్వే సమస్త సమాచారం క్షణాల్లో లభించేలా ఒక అంతస్తు మొత్తం దీనికే కేటాయించారు. ఈ అంతస్తులోకి అడుగు పెట్టగానే రాష్ట్రంలో పెట్టబుడులు పెట్టడానికి ఎలాంటి అనుకూల వాతావరణం ఉంది, పెట్టబుడుల ప్రగతి ఎలా ఉంది తదితర అనేక అంశాలు సందర్శకులకు తెలిసేలా అత్యాధునిక సాంకేతికతల మేళవింపుతో ఏర్పాటు చేశారు. ఈ 11 అంతస్థుల భవంతిలో ప్రతి అంతస్తులోనూ ప్రత్యేకతలు మేళవించేలా నిర్మాణం చేపట్టారు. ఏపీఐఐసీ మంగళగిరిలో నూతనంగా నిర్మించిన ఏపీఐఐసీ టవర్స్-1 భవంతిని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారు శుక్రవారం ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం 3.00 గంటలకు ఈ భవనం ప్రాంగణంలో భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు.