ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ కు అమరావతి పరిరక్షణ సమితి లేఖ రాసింది. రాజధాని బిల్లులు సెలెక్ట్ కమిటీ పరిధిలో ఉన్న నేపథ్యంలో, అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం లేదని ఆ లేఖలో తెలిపింది. రాజధాని రైతుల హక్కులకు భంగం కలిగించేలా అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నారని ప్రజాస్వామ్య, రాజ్యాంగ హక్కులను కాపాడాలని, ఆ లేఖలో తెలిపింది. నిజానికి గత రెండు రోజులుగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మూడు రాజధానుల బిల్లుని గవర్నర్ వద్దకు పంపిస్తుందని, మీడియాలో వార్తలు వస్తున్నాయి. శాసనమండలిలో మొదటి సారి బిల్లులు ప్రవేశపెట్టగా, అవి సెలెక్ట్ కమిటీకి వెళ్ళాయి. అయితే కమిటీ వెయ్యకుండా, ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. రెండో సారి శాసనమండలిలో ఆ బిల్లులు పెట్టింది, అయితే సభ నిరవధికంగా వాయిదా పడింది. దీంతో, 14 రోజులు దాటి పోవటంతో, ఆ బిల్లులకు ఆమోదం కోసం, గవర్నర్ వద్దకు పంపించి, గవర్నర్ ఆమోదంతో, మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుని, ఆమోదింపచేసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ వారం, లేదా వచ్చే వారం, ఈ ప్రక్రియ అయిపోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది.
అయితే, ప్రభుత్వం తరుపు కుట్రని పసిగట్టిన అమరావతి పరిరక్షణ సమితి, గవర్నర్ కు లేఖ రాసింది. కన్వీనర్ ఏ.శివా రెడ్డి ఈ లేఖ రాసారు. రెండు బిల్లులను ఆర్టికల్ 237, 238 కింద, సెలెక్ట్ కమిటీకి పంపించారని అన్నారు. రెండో సారి ఈ బిల్లుని మండలిలో ప్రవేశ పెట్టటం, చట్ట విరుద్ధం అని అన్నారు. అమరావతి కోసం రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారని, అయితే ఇవేమీ పట్టించుకోకుండా, మంత్రిమండలిలో చర్చ లేకుండా, హడావిడిగా ఆమోదించి, అసెంబ్లీలో పాస్ చేసారని, ఇలాంటి హడావిడి బిల్లులను శాసనమండలిలో మరింతగా చర్చించే అధికారం ఉందని, దాని ప్రకారమే చర్చించి సెలెక్ట్ కమిటీకి పంపారని తెలిపారు. అయితే, సెలెక్ట్ కమిటీ వెయ్యకుండా, ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి, రెండో సారి మండలిలో ప్రవేశపెట్టారని అన్నారు. మండలి చైర్మెన్ సెలెక్ట్ కమిటీ వెయ్యలేదని, ఇప్పటికే ఫిర్యాదు చేసారని గవర్నర్ దృష్టికి తెచ్చారు. ఒకసారి సెలెక్ట్ కమిటీ దగ్గర ఉండగా, మళ్ళీ అసెంబ్లీలో ప్రవేశపెట్టె అధికారం లేడని అన్నారు. సెలెక్ట్ కమిటీకి వెళ్ళిన విషయం ప్రభుత్వం హైకోర్టు కి కూడా చెప్పిన విషయం తెలిపారు. కౌన్సిల్ వద్దే ఉన్న బిల్లుల పై, ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు అంటూ, రాజ్యంగ పరిరక్షకుడిగా సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇప్పుడు గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారా అనే ఆసక్తి నెలకొంది.