ఏపీఎస్ఆర్టీసీకి అత్యాధునిక బస్సులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది. వీటిని సోమవారం అధికారికంగా ప్రారంభించారు. 2018 సంవత్సరంలో ఆర్టీసీ యాజమాన్యం అత్యాధునిక వసతులున్న 19 అమరావతి ఏసీ బస్సులను కొనాలని నిర్ణయించి, ఆమేరకు కొనుగోలుకు చర్యలు కూడా తీసుకున్నది. ఒక్కో బస్సు ఖరీదు రూ. 1,15,50,000 ఉంది. అధిక వ్యయంతో కూడుకున్న ఈ బస్సుల్లో ప్రస్తుతం ఏసీ అమరావతి బస్సులు బస్ భవనకు చేరుకున్నాయి. ఈ కొత్త బస్సులు కొన్ని ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ఆటోమేటిక్ గేర్, హై హార్స్ పవర్ -380, అధునాతన సౌకర్యవంతమైన పాసింజర్ సీట్లో కలిగి ఉన్నాయి.
ఒక్కో బస్సులో ఆధునిక పద్దతిలో 47 సీట్లు ఏర్పాటు చేశారు. బస్ పొడవు వచ్చేసి 13.8 మీటర్లు ఉంది. ఇందులో రెండు టీవీలు, 3 సీసీ కెమెరాలు కూడా ఉండడం గమనార్హం. ప్రతి సీటుకు మొబైల్ ఫోన్ ఛార్జ్ చేసుకునే సదుపాయాన్ని కూడా కలిగించారు. వోల్వో కంపెనీ ద్వారా వీటిని కొనుగోలు చేశారు. రాష్ట్ర రవాణా శాఖా మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం ఈ బస్సులను ప్రారంభించారు. కాగా ఇప్పటికే సంస్థలో మొత్తం 263 ఏసీ బస్సులున్నాయి. ఇందులో అమరావతి బస్సులు 45, గరుడ 60, గరుడ ఫస్ట్ 21, ఇంధ్ర 100, మెట్రో లగ్జరీ 30, వెన్నెల 7 ఏసీ బస్సులు తిరుగుతున్నాయి. 2017లో 25 గరుడ బస్సులను కరోన సంస్థ నుంచి కొనుగోలు చేశారు. ఈసందర్భంగా ప్రతి బస్సుకు రూ. 66 లక్షలు వ్యయం చేశారు. ఏపీఎస్ఆర్టీసీలో మొత్తం 11,781 బస్సులున్నాయి. వాటిలో 2,722 బస్సులు అద్దె ప్రాతిపదికన నడుస్తున్నాయి. అంటే ఆర్టీసీ ఆధ్వర్యంలో నికరంగా ఉన్న బస్సులు 9,050 మాత్రమే.
49 శాతం బస్సులు గ్రామీణ ప్రాంతాల్లోను, 11 శాతం సిటీ బస్సులు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో తిప్పుతున్నారు. స్పెషల్ టైపు బస్సులు సూపర్ లగ్జరీవి 1340, అల్ట్రా డీలక్స్ 618, ఎక్స్ప్రెస్ 2026, ఏపీ 263 బస్సులు వివిధ రూట్లలో తిరుగుతున్నాయి. రాష్ట్ర ప్రజల అవసరాలకు అనుగుణగా బస్సులు నడుపుతూ ప్రతి రోజు 43లక్షల కిలో మీటర్లు తిప్పుతున్నారు. రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికి బస్సులు నడుతున్నారు. గిరిజన కొండ ప్రాంతాలలోని పాడేరులో సైతం ఆర్టీసీ డిపో ఉన్నది. సమిష్టి కృషి, ప్రజల ఆదరణ, ప్రభుత్వ సహకారం వల్ల గత ఏడాది 66.88 శాతం ఉన్న ఆక్యుపెన్సీ 73.29 శాతానికి పెరిగింది. తద్వారా గత ఏడాది (జనవరి 2017 వరకు ఉన్న రూ. 736.84 కోట్ల నష్టాలను ప్రస్తుతం రూ. 403.75 కోట్లకు తగ్గించుకోగలిగారు. అంటే దాదాపు రూ. 333.09 కోట్ల నష్టాలను అధిగమించగలగడం గమనార్హం.