ఈ రోజు అనంతపురం జిల్లాలో ఎస్ఎస్బిఎన్ కళాశాలలో విద్యార్ధుల పై విరిగిన లాఠీల పై, అన్ని వైపుల నుంచి ప్రభుత్వం పై విమర్శలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, రాష్టంలోన అన్ని ఎయిడెడ్ విద్యాసంస్థలకు ఎయిడ్ ఇవ్వకూడదని నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ విద్యా సంస్థలు మూసివేయటమో లేక, ప్రైవేట్ వాళ్లకి అమ్ముకోవటమో చేయాలి. ఇలా చేస్తే, ఇక్కడ చదువుకునే వారి ఫీజులు అధికం అవుతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అనేక ఎయిడెడ్ విద్యా సంస్థలకు గత కొన్నేళ్ళుగా ప్రభుత్వాలు కొంత మేర ఆదుకుంటూ కొంత ఎయిడ్ ఇస్తాయి. వాటితో నిర్వహణ తేలిక అవుతుంది కాబట్టి, ఇక్కడ ఫీజులు కూడా తక్కువ ఉంటాయి. అందుకే ఎక్కువ మంది పేద, మధ్య తరగతి విద్యార్దులు ఇక్కడ చదువుకుంటారు. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఎయిడెడ్ విద్యా సంస్థలు మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ నిర్ణయం పై అనేక ప్రాంతాల్లో నిరసనలు తెలుపుతున్నారు. ఇప్పుడు తాజాగా అనంతపురం ఎస్ఎస్బిఎన్ కళాశాలలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్ధులు ఆందోళన చేసారు. విద్యార్ధి సంఘాలతో కలిసి విద్యార్ధులు చేసిన ఈ ఆందోళన, ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు లాఠీ చార్జ్ చేసే దాకా వెళ్ళింది.
ఆ వీడియోలు, ఫోటోలు చూసిన చాలా మంది, పోలీసులు, ప్రభుత్వం తీరుని తప్పుబట్టారు. దీని పై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ట్విట్టర్ లో స్పందిస్తూ, ప్రభుత్వ తీరుని ఎండగట్టారు. అయితే దీని పై అనంతపురం పోలీసులు చంద్రబాబు ట్వీట్ కు రిప్లై ఇస్తూ, అసత్య ప్రచారం అని కొట్టి పారేసారు. పోలీసులు లాఠీ చార్జ్ చేయలేదని, విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో తోపులాట జరిగిందని, అసత్య ప్రచారాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ, చంద్రబాబు ట్వీట్ కు రిప్లై ఇచ్చారు. అయితే పోలీసుల తీరు పై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అనేక వీడియోలు, ఫోటోలలో విద్యార్ధుల పై పోలీసుల వ్యవహరించిన తీరు కనిపిస్తుంటే, కేవలం తోపులాట అని చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని ఎలా అంటారు అంటూ, ఆ ఫోటోలు, వీడియోలు పెట్టి అనంతపురం పోలీసులకు కౌంటర్ ఇచ్చారు. మరి అనంతపురం పోలీసులు ఏమని రిప్లై ఇస్తారో చూడాలి.