ఆంధ్రప్రదేశ్ లో నిన్న రాత్రి ఉద్యోగ సంఘాల జేఏసిలకు ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం, ఆ నలుగు ఉద్యోగ సంఘ నేతలు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసిన పనులు పైన, కింద స్థాయి ఉద్యోగులు భగ్గు మంటున్నారు. అయితే ప్రధానంగా, టీచర్స్ మాత్రం చాలా ఆగ్రహంగా ఉన్నారు. నిన్న రాత్రే, వారు ఉమ్మడి ప్రెస్ మీట్ ని బహిష్కరించారు. అసలు ఏమి జరగకుండా, ఎందుకు ఒప్పుకున్నారో అర్ధం కాలేదని, వారు బయటకు వచ్చేసారు. అయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడెరేషన్ నాయకులు, కే.భానుమూర్తి, పాండురంగా ప్రసాద్, ఇప్పుడున్న ఉద్యోగుల జేఏసి నుంచి బయటకు వచ్చేస్తున్నాం అని, జేఏసి పదవులకు రాజీనామా చేస్తున్నాం అని, లేఖ విడుదల చేసారు. ఈ లేఖను ఏపి జేఏసి చైర్మెన్, బండి శ్రీనివాస్ రావుకు కొద్ది సేపటి క్రితం పంపించారు. ఉద్యోగులు, పెన్షనర్ల ఆశలను ఏపి జేఏసి పట్టించుకోకుండా చేసారని, వాళ్ళు ఆరోపించారు. అదే విధంగా నాయకత్వం అప్రజాస్వమిక, మోస పూరిత వైఖరికి నిరసనగా, తాము జేఏసి పదవులకు రాజీనామా చేసి, బయటకు వస్తున్నాం అని వాళ్ళు స్పష్టం చేసారు. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంతో, పలు మార్లు జరిగిన చర్చల్లో బలమైన వైఖరి ప్రదర్శించక పోగా, ముఖ్యంగా ఉపాధ్యాయలు, ఉద్యోగులు ఏది కోరుకుంటున్నారో, వాటి డిమాండ్ల సాధన పరిష్కారంలో విఫలం అయ్యాం అని వారు స్పష్టం చేసారు.
ఈ నెల 3వ తేదీన, లక్షలాది మందితో నిర్వహించిన ఉద్యోగ ఉపాధ్యాయుల చలో విజయవాడ కార్యక్రమాన్ని భారీగా ప్రదర్శన నిర్వహించి విజయవంతం చేసామని అన్నారు. ఇంత మంచి అవకాసం వచ్చి, ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చినా, అంత మంచి అవకాసం కూడా ఉపయోగించుకోలేక పోయామని వారు అభ్యంతరం వ్యక్తం చేసారు. ప్రధానంగా పెన్షనర్ల డిమాండ్లు సాధించ లేక పోయాం అని, సిపీఎస్ రద్దు పైన ఎటువంటి, హామీ పొందలేక పోయామని ఆవేదన వ్యక్తం చేసారు. లక్షలాది మంది ఉద్యోగులు కోరుకుంటున్న సిపిఎస్ హామీ విషయంలో ఏమి సాధించారని ప్రశ్నించారు. అలాగే ఐఆర్ విషయంలో ఏమి సాధించారని, పీఆర్సి విషయంలో ఏమి సాధించారని, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో ఏమి చేసారని ప్రశ్నించారు. సమ్మె విరమణ ప్రకటన చేసే ముందు, మీ నలుగురు చర్చించుకుంటే సరిపోతుందా అని, ఇతర వర్గాలతో కనీసం చర్చ చేయకపోతే, ఇంకా ఇలాంటి వాటిలో మేము ఎందుకు అని ఏపి జేఏసి నుంచి రాజీనామా చేసి పడేసారు.