పెద్ద నోట్ల రద్దుపై మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. నోట్లరద్దుపై ఇంతవరకూ మౌనంగా ఉన్న ఆయన‌ ఎట్టకేలకు తన మౌనాన్ని వీడారు. నోట్లరద్దు దారుణమైన చర్య అని, ద్రవ్య విధానానికి పెద్ద షాక్‌ అని అన్నారు. దీని వల్ల వృద్ధి రేటు తగ్గిందన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఆ ఒక్క నిర్ణయం వల్ల చలామణిలో ఉన్న కరెన్సీలో 86 శాతం వెనక్కి వెళ్లిందని, ఇది జీడీపీపై తీవ్ర ప్రభావం చూపిందని పేర్కొన్నారు. నోట్ల రద్దు చాలా దారుణమైన నిర్ణయమని అన్నారు. త్వరలో విడుదల కానున్న ‘ఆఫ్‌ కౌన్సిల్‌: ది ఛాలెంజెస్‌ ఆఫ్‌ ది మోదీ-జైట్లీ ఎకానమీ’ పుస్తకంలో అరవింద్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

modi 29112018 2

‘నోట్ల రద్దు చాలా దారుణం. నగదుకు పెద్ద దెబ్బ. ఒక్క నిర్ణయంతో చలామణీలో ఉన్న కరెన్సీలో 86శాతం వెనక్కి వెళ్లింది. నోట్ల రద్దు జీడీపీ వృద్ధిపై ప్రభావం చూపింది. నోట్ల రద్దుకు ముందు కూడా వృద్ధి నెమ్మదించినప్పటికీ 2016, నవంబరు 8 తర్వాత అమాంతం పడిపోయింది. నోట్ల రద్దుకు ముందు ఆరు త్రైమాసికాల్లో సగటు జీడీపీ వృద్ధి 8శాతంగా నమోదైంది. కానీ నోట్ల రద్దు తర్వాత ఏడు త్రైమాసికాల్లో సగటు జీడీపీ 6.8శాతానికి తగ్గింది’ అని అరవింద్‌ సుబ్రమణియన్‌ ఆ పుస్తకంలో పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత వడ్డీరేట్లు, జీఎస్‌టీ, చమురు ధరల జీఎస్‌టీ వృద్ధిని ప్రభావితం చేశాయని చెప్పారు. రాజకీయ పరిభాషలో నోట్ల రద్దు అనూహ్య పరిణామం అని, ఇటీవలి కాలంలో సాధారణ పరిస్థితుల్లో ఏ దేశమూ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.

modi 29112018 3

ఇక నోట్ల రద్దు అనంతరం ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా విజయాన్ని ప్రస్తావిస్తూ.. ‘నోట్ల రద్దు గందరగోళానికి ఒక సమాధానం మాత్రం ఉంది. పెద్ద లక్ష్యాలను సాధించే క్రమంలో పేదలకు ఇబ్బదులు సర్వసాధారణం. సంపన్నుల, అక్రమార్కులను కష్టపెట్టే క్రమంలో పేదలు తమ ఇబ్బందులను పట్టించుకోరు. నాది ఒక మేక పోయింది.. వాళ్లవి ఆవులు పోయాయి అని భావిస్తారు.’’ అని పేర్కొన్నారు. రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేస్తూ 2016, నవంబరు 8న ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రద్దు నిర్ణయంపై అప్పటి ఆర్థిక సలహాదారుగా ఉన్న అరవింద్‌ సుబ్రమణియన్‌ను సంప్రదించలేదని ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. అయితే ఈ విమర్శలపై అరవింద్‌ ఎప్పుడూ స్పందించలేదు. తాజాగా ఆయన నోట్లరద్దుపై వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. నాలుగేళ్ల పాటు ఆర్థిక సలహాదారుగా ఉన్న అరవింద్‌ గతేడాది పదవి నుంచి తప్పుకున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read