విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో మూడో రోజు ‘ప్లీనరీ విత్ సోషల్ ఐకాన్’ పేరిట నిర్వహించిన సమావేశంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గురూజీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ ప్రశ్నలకు సమాధానమిచ్చారు... ముఖ్యంగా శ్రీశ్రీ అమరావతి పై మాట్లాడుతూ "రాష్ట్ర విభజనపై తానూ ఆవేదన చెందినా ఆంధ్రప్రదేశ్ లో, అమరావతి లాంటి రాజధాని సాధ్యమైంది అంటే, అది హైదరాబాద్ విడిచి రావటం వల్లే, ఈ విషయంలో ముఖ్యమంత్రిని అభినందించాలి.. చంద్రబాబు నాయకత్వం, అద్భుతమైన రాజధాని నిర్మాణం జరుగుతుంది అనే నమ్మకం ఉంది... ఆంధ్రప్రదేశ్ కూడా చంద్రబాబు సారధ్యంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది అంటూ, శ్రీశ్రీ కితాబు ఇచ్చారు...
యువతలో ప్రతిభ, ఆత్మవిశ్వాసం, సమాజంపై నమ్మకం ఉంటే ఆ సమాజ అభివృద్ధిని ఎవరూ ఆపలేరని రవిశంకర్ గురూజీ అభిప్రాయపడ్డారు. స్వయంగా ఎదగటంతో పాటు సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలన్న దాతృత్వ గుణం ఉండాలని స్పష్టం చేశారు. కార్పోరేట్ సామాజిక బాధ్యత నిధిని రెట్టింపు చేయాలని అభిప్రాయపడ్డారు. వ్యక్తితో పాటు సమాజంపై ఒత్తిడి తగ్గినప్పుడే సదరు సమాజం వృద్ధిపథంలో దూసుకు పోతుందని రవిశంకర్ గురూజీ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రతి వ్యక్తి నైతిక విలువలతో కూడిన క్రమశిక్షణను అలవర్చుకోవాలని ఆద్యాత్మిక భావన, ధ్యానం, వ్యవస్థలపై విశ్వాసం వంటి అంశాలతో ఇవి ముడిపడి ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సమాజానికి చెందిన సంపదను ఒక్కడే అనుభవించాలని చూస్తే అది దోపిడీ అవుతుందని.. సంపద సమాజానిది, ఆస్థి వ్యక్తిగతమన్నారు. జీవితంలో తృప్తి అనేది ముఖ్యమని.. ఎంత సంపద ఉన్నా తృప్తిలేకపోతే ఆనందం దక్కదని సూచించారు. పనిని ప్రేమిస్తూ.. ప్రశాంతంగా నిద్రిస్తానని సీఎం వ్యాఖ్యానించారు.