దేశంలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజ్యసభలో కేంద్రం మూడు అంశాలకు సభ ముందు పెట్టి, అందరినీ ఆశ్చర్య పరిచింది. ఆర్టికల్ 370 రద్దు , 35(ఏ) రద్దు , జమ్ము కశ్మీర్ రాష్ట్ర విభజన వంటి మూడు కీలక అంశాలు ప్రవేశపెట్టారు. దీంతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి చెలరేగింది. నిమిషాల్లోనే ఆర్టికల్370 రద్దు చేస్తూ రాష్ట్రపతి వెనువెంటనే ఆదేశాలు జారీ చేశారు. మరో పక్క జమ్ము, కశ్మీర్, లద్దాక్ ప్రాంతాలుగా, జమ్ము కశ్మీర్ రాష్ట్రాన్ని విడదీసారు. జమ్ము, కశ్మీర్‌లు అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలుకాగా, లద్దాక్ అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించారు. ఈ గందరగోళం మధ్య కొంచెం సేపు రాజ్యసభ ప్రసారాలు కూడా ఆగిపోయాయి. లోపల ఏమి జరుగుతుందో తెలియలేదు. కొద్ది సేపటి తరువాత ప్రసారాలు ప్రారంభం అయ్యాయి.
దీని పై కాంగ్రెస్, పీడీపీ, డీఎంకే, ఎస్పీ వ్యతిరేకత వ్యక్తం చేస్తూ నిరసనకు దిగాయి. మరో పక్క టిడిపి, వైసిపీ, టీఆర్ఎస్ అనుకూలంగా ఉన్నాయి. ఈ నిర్ణయం పై దేశం మొత్తం సంతోషం వ్యక్తం చేస్తున్నా, అసలు నిర్ణయం అమలు అయినా జమ్ము కాశ్మీర్ వాసులు ఎలా ఆలోచిస్తున్నారు అనే విషయం మాత్రం తెలియలేదు. ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే, ఆంధ్రప్రదేశ్ విభజన నాటి పరిస్థితి గుర్తుకు వస్తుంది. అప్పుడు కూడా తెలంగాణాలో సంబరాలు చేసుకుంటే, ఏపిలో నిరసనలు చెలరేగాయి. ఇప్పటికీ ఈ నిర్ణయం వల్ల ఏపి నష్టపోయింది. ఎప్పటికి కోలుకుంటుందో కూడా తెలియని పరిస్థితి. అప్పుడు కూడా ఇలాగే ఆదరాబాదరాగా తలుపులు మూసి, లైవ్ కవరేజ్ ఆపేసి, అప్పటి కాంగ్రెస్ బిల్ పాస్ చేసింది. దీనికి బీజేపీ సహకరించింది.
ఇప్పుడు కాంగ్రెస్ కు, ఇలాంటి పరిస్థితి ఎదురైంది. అప్పట్లో వాళ్ళు ఎలా చేసారో, ఇప్పుడు బీజేపీ కూడా మంద బలంతో ఈ నిర్ణయం తీసుకుంది. కొంచెం సేపు లైవ్ కవరేజ్ ఆగిపోయింది కూడా. ఇప్పుడు కూడా దేశం అంతా సంతోష పడుతుంటే, అసలు నిర్ణయం అములు అయ్యే కాశ్మీర్ ప్రజలు మాత్రం నిఘా నీడలో, కనీసం ఇంటర్నట్, ఫోన్ కూడా లేకుండా బిక్కు బిక్కు మంటూ ఉన్నారు. కాశ్మీర్ లోయ మొత్తం సైన్యం ఆధీనంలో ఉంది. ఏది ఏమైనా, కొన్ని ఏళ్ళుగా నడుస్తున్న ఈ సమస్యను, ప్రభుత్వం ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకుంటుంది. అయితే, ఇప్పుడు తీసుకుంది కేవలం నిర్ణయం మాత్రం. అసలు పని ఇప్పటి నుంచి ఉంటుంది. కాశ్మీర్ లో హింస చెలరేగకుందా చూసుకోవాలి. అక్కడ ప్రజలని ఒప్పించాలి. ఇవన్నీ చెయ్యకుండా, మొండిగా వెళ్తే మాత్రం, సమస్య మరింత జటిలం అవుతుంది. మరో నోట్ల రద్దు, జీఎస్టీ లాగా, నిర్ణయం మంచిదే అయినా , అమలులో లోపం ఉన్న నిర్ణయంగా మారిపోతుంది. కేంద్రం, జాగ్రత్తగా డీల్ చేస్తుందని భావిద్దాం.