రాష్ట్రంలో మెగా, భారీ ప్రాజెక్టుల స్థాపనే లక్ష్యంగా.. విశాఖ హార్బర్ పార్కులో సీఐఐ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు శనివారం అట్టహాసంగా మొదలైంది.... ఈ సందర్భంగా, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులకు భరోసా కల్పించే సమర్ధవంతమైన ప్రభుత్వం ఉందన్నారు. ఏపీలో పారదర్శక పారిశ్రామిక పాలసీ పారిశ్రామిక వేత్తలను ఆకర్షిస్తోందన్నారు. సదస్సుల ద్వారా పెట్టుబడుల సాధనలో ఇతర రాష్ట్రాల కంటే ఏపీ అగ్రస్థానంలో ఉందని అశోక్ పేర్కొన్నారు. సీఐఐ ఉమ్మడి ఏపీలో ఆరుసార్లు పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తే నవ్యాంధ్రలో ఒక్క విశాఖలోనే మూడుసార్లు నిర్వహించడం దీనికి నిదర్శనమన్నారు.
అలాగే చంద్రబాబు పై, ప్రశంసలు కురిపించారు... ‘సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్’ సదస్సులో అశోక్‌గజపతిరాజు ప్రసంగిస్తూ.. చంద్రబాబు ‘మై ఫ్రెండ్.. మై లీడర్.. మై ఇన్స్పిరేషన్’ అని ప్రకటించారు. నవ్యాంధ్ర ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించారు. చంద్రబాబు నిరంతరం శ్రమిస్తూ రాష్ట్రాన్ని విజయపథంలోకి తీసుకొచ్చారని తెలిపారు. దేశ ప్రగతి సింగిల్ డిజిట్లో వుంటే.. ఏపీ రెండెంకెల వృ ద్ధి నమోదు చేస్తోందన్నారు. రాష్ట్రంలో అన్ని పారదర్శకంగా ఉంటాయన్నారు...
ఆంధ్రప్రదేశ్‌లో విమానాల ఓవర్ హాలింగ్ సదుపాయం కల్పనకు ప్రయత్నిస్తున్నట్లు అశోక్ గజపతిరాజు వెల్లడించారు. భారతదేశానికి చెందిన విమానాలను ఓవర్ హాలింగ్ కోసం సింగపూర్, దుబాయ్, శ్రీలంక దేశాలకు పంపుతున్నామని, వీటికి ఏటా రూ.4,867 కోట్లు (75 కోట్ల డాలర్లు) చెల్లిస్తున్నామన్నారు. భోగాపురంలో నూతనంగా ఏర్పాటుచేసే గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయంలో మరమ్మతులు, ఓవర్ హాలింగ్ సదుపాయం కల్పించడానికి ప్రతిపాదించామని, దీనివల్ల ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని తెలిపారు.