ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, అశోక్ గజపతి రాజు గారి పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. పార్టీలకు అతీతంగా అందరూ, వెల్లంపల్లిని తప్పుబట్టారు. అశోక్ గజపతి రాజు గారి పేరు కూడా తలవటానికి అర్హత లేని వెల్లంపల్లి అంటూ అన్ని వైపుల నుంచి ఆయన పై విమర్శలు వచ్చాయి. అనేక క్షేత్రయ సంఘాలు వెల్లంపల్లి వ్యాఖ్యల పై నిరసనలు తెలిపాయి. అయినా వెల్లంపల్లి మాత్రం తప్పు తెలుసుకోలేదు. అయితే వెల్లంపల్లి వ్యాఖ్యల పై అశోక్ గజపతి రాజు పరోక్షంగా స్పందించారు. తన స్థాయికి తగదు అనుకున్నారో ఏమో, పరోక్షంగా స్పందించారు. ఆయన నిన్న ఒక వీడియో మెసేజ్ విడుదల చేస్తూ, దేవాలయాల పై జరుగుతున్న ఘటనల పై స్పందించారు. "ప్రస్తుత దేవాదాయ మంత్రి గారు, మనకి దేవుడు మాటలు కానీ, ధర్మం మాటలు కానీ, ఆ నోట్లో నుంచి రావటం లేదు. పచ్చి బూతులే ఆయన నోటిని నుంచి వస్తున్నాయి. మనందరికీ కోపం తేవటానికి, అసలు విషయం నుంచి, డైవర్ట్ చేయటానికి చేస్తున్నారు. హిందూ దేవాలయాల ఆస్తులు దోచేస్తుంటే, దానికి అడ్డు పడకుండా, ఈ తిట్లు తిడితే, ఎవరూ బాగుపడరు అనే విషయం మీకు మనవి చేస్తున్నాను. అందుకోసం ఆ ఫోకస్ అంతా హిందూ మతాన్ని కాపాడుకోవటానికి ఉండాలి." అంటూ అశోక్ గజపతి రాజు, వెల్లంపల్లికి కౌంటర్ ఇచ్చారు...
ఇక ఆయన మాట్లాడుతూ, వందల ఏళ్ళ చరిత్ర కలిగిన పురాతన దేవాలయాల పై ఉద్దేశ్యపూర్వక ఘటనలు జరుగుతున్నయాని అన్నారు. హిందువుల విశ్వాసం పైన, ధార్మిక చిహ్నలపైన, విగ్రహాల పైన, పూజారుల పైన ఉద్దేశ్యపూర్వక ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. ఆలయాల ట్రస్ట్ బోర్డు ధర్మకర్తల నియామకాల్లో, రూల్స్ పాటించకపోవటంతో, అన్యామతస్తులు, నేరచరితులు నియామకం జరుగుతుందని అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నా, వంశపారంపర్య ధర్మకర్త హక్కులను హరించి, ఆచార వ్యవహారాలకు తూట్లు పొడిచి, విచ్చలవిడి నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. ఏండోమెంట్ భూములు జాయింట్ కలెక్టర్ పరిధిలోకి తీసుకురావటం, ఆర్ధిక నేరాల ఆరోపణలు, బెయిల్ మీద ఉన్న వ్యక్తులకు, దేవాలయల భూములు క్రమబద్దీకరణ కమిటీలో వేయటం వంటికి ఈ కుట్రలో భాగమే అని అన్నారు. గోశాలలు గాలికి వదిలేసారని, ట్రస్ట్ బోర్డులు/చైర్ పెర్సన్లు ద్వారా దేవాలయాల డిపాజిట్లు కొల్లగొట్టటం , ప్రసాదాలు, దర్శన టిక్కెట్లు, కాటేజీలు, టోల్ చార్జీలు ధరలు విపరీతంగా పెంచేశారని అశోక్ గజపతి రాజు అన్నారు.