తెలుగుదేశం పార్టీకి చెందిన, నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీ మారిన విషయం తెలిసిందే. రాజ్యసభలో తమ పార్టీని, బీజేపీతో విలీనం చేస్తున్నాం అంటూ, నిన్న లేఖ ఇచ్చారు. అయితే, దీని పై తెలుగుదేశం పార్టీ నేతలు, పార్టీ మారిన నేతల పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారం పై, కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్‌గజపతిరాజు తనదైన శైలిలో స్పందించారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, కాబట్టే కొందరు పార్టీని వీడుతున్నారని అశోక్‌గజపతిరాజు అన్నారు. పార్టీ మారిన నేతల వల్ల, పార్టీ పై కొంత ప్రభావం ఉంటుందని తెలిపారు. అయితే ఈ కష్ట సమయంలో, తెలుగుదేశం కార్యకర్తల నుంచి మళ్లీ కొత్త నాయకత్వం పుట్టుక రావలసిన అవసరం ఉంటుందన్నారు. టీడీపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, సుజనా చౌదరి, గరికపాటి రామ్మోహన్, టీజీ వెంకటేశ్ నిన్న బీజేపీ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. వీరిలో సుజనా చౌదరితో కలిసి, అశోక్ గజపతి రాజు మంత్రిగా కూడా పని చేసారు.
ఇక మరో పక్క తెలుగుదేశం పార్టీ ఓటమి పై కూడా అశోక్ గజపతి రాజు స్పందించారు. ప్రభుత్వ పథకాల అమలు చెయ్యటంలో చంద్రాబాబు బాగా పని చేసినా, పధకాలతో పాటు ప్రజల్లోకి వెళ్ళే ప్రజంటేషన్ కూడా ముఖ్యమేనని అన్నారు. ఈ రెండింటి మధ్య గ్యాప్ వచ్చిందని, ఇది పుడ్చటంలో విఫలం కాబట్టే, తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోయిందని చెప్పారు. అయితే ఇవన్నీ చూస్తూ పార్టీ కున్గిపోయే పని లేదని, తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ బలంగా ఉందని, తన తప్పులు తెలుసుకొని చికిత్స చేయాలని అన్నారు. తప్పుడు తెలుసుకోకుండా, తగిన చర్యలు తీసుకోకుండ, ఇంకా ఏదో భ్రమలో ఉంటే నాయకత్వం నిలబడదని సూచించారు. ఇక జగన్ మోహన్ రెడ్డి నెల రోజుల పాలన పై స్పందిస్తూ, ఇప్పుడే ఏమి చెప్పలేమని అన్నారు. కాని జగన్ లాంటి వాళ్ళు కూడా నీతి సూక్తులు చెప్తుంటే, ఆశ్చర్యంగా ఉందని అన్నారు. జగన్ ఎన్నికల ముందు ఓ మాట, ఎన్నికలు అయిపోయాక మరో మాట చెబుతున్నారని విమర్శించారు.