నాకు పవన్ కళ్యాణ్ అంటే ఎవరో తెలీదు అని, రెండు సంవత్సరాల క్రితం ఒక సందర్భంలో అశోక్ గజపతి రాజు గారు అన్నారు.. ఆ వ్యాఖ్య పట్టుకుని, రెండేళ్ళు అయినా, పవన్ కళ్యాణ్ అదే విషయం పై తన యాత్ర మొదలైన దగ్గర నుంచి ఎదో ఒక సందర్భంలో అంటున్నారు. "అశోక్ గారూ.. నేను మీ విజయనగరం వచ్చాను.. మీ కోట దగ్గరకు వచ్చాను. నా పేరేనండి పవన్ కల్యాణ్. నన్ను పవన్ కల్యాణ్ అంటారు. నేను మీకోసం 2014లో ప్రచారం చేశాను. మీరు అనుభవించిన కేంద్రం మంత్రి పదవికి కారకుడినండి."అంటూ పీక్స్ కి వెళ్ళిపోయాడు పవన్... గత పది రోజుల నుండి, నేను ఎవరో తెలీదు అంటారా అంటూ, పవన్ కొడుతున్న డైలాగ్లు చూసి ప్రజలు కూడా నవ్వుకున్నారు. అశోక్ గజపతి రాజు, నాకు పవన్ తెలుసు అనే దాక పవన్ ఈ విషయం వదలడు అనే మాటలు వినిపించాయి..
అయితే, నిన్న అశోక్ గజపతి రాజు గారు మీడియాతో మాట్లాడారు. పవన్‌కల్యాణ్ విషయమై మాట్లాడుతూ ఆన్ స్క్రీన్ కాని, ఆఫ్ స్క్రీన్ కాని ఆయన గురించి నాకు తెలియదని అశోక్ అన్నారు. తెర వెనుక ఎవరో రాసి ఇచ్చినది చదివితే ఉన్న గౌరవాన్ని కోల్పోతారన్నారు. రాజకీయాల్లో ఎన్టీఆర్ లెజెండ్ అని, ఆయన విలువలతో కూడిన రాజకీయాలు చేశారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఎన్టీఆర్ కుమారుల పెళ్లి సమ యాల్లో కూడా ప్రజా సేవలోనే ఉండి ప్రజలే ముఖ్యమన్న సంకేతాలు పంపారన్నారు. మొత్తానికి, మళ్ళీ నాకు పవన్ అంటే ఎవరో తెలీదు అనటంతో, మళ్ళీ పవన్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి..
మరో పక్క, ఎయిర్ ఆసియా విషయమై అశోక్ మాట్లాడుతూ సంబంధిత సీఈవో ఫోన్ సంభాషణతో తనకు సంబంధం లేదన్నారు. భారత్‌లో విమాన రంగాన్ని అభివృద్ధిలోకి తీసుకువచ్చి, యువతకు ఉపాధి కల్పించాలని అనుకున్నానని చెప్పారు. భోగాపురం ఎయిర్‌పోర్టు గ్రోత్ పెంచాల్సిన అవసరం కేంద్రంపై ఉందన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, ఎమ్మెల్యే మీసాల గీత, మున్సిపల్ చైర్మన్ రామకృష్ణ, టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, బొద్దల నర్సింగరావు, వీఎస్ ప్రసాద్ పాల్గొన్నారు.