బీజేపీయేతర పక్షాలను ఏకం చేసే ప్రక్రియలో చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు, మరింత ఊతంగా, టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్‌కు రెండు సార్లు సీఎంగా పనిచేసిన అశోక్ గెహ్లాట్ అమరావతి రానున్నారు. రేపు(శనివారం) మధ్యాహ్నం అశోక్ గెహ్లాట్ ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి విజయవాడ వెళ్తారు. అక్కడ గేట్ వే హోటల్లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 5 గంటల తర్వాత అమరావతిలోని చంద్రబాబు నివాసంలో వారిద్దరూ సమావేశం కానున్నారు.
ఇటీవలే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. బీజేపీయేతర పక్షాలను ఏకం చేయడానికి చేపట్టాల్సిన ఉమ్మడి కార్యాచరణ మీద చర్చించారు. రాహుల్ దూతగా చంద్రబాబుతో మాట్లాడేందుకు అశోక్ గెహ్లాట్ శనివారం అమరావతి వస్తున్నారు. భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై వారు చర్చించనున్నట్లు సమాచారం. ఎన్డీయే నుంచి చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత దేశంలోని ప్రాంతీయ పార్టీలతోపాటు మొత్తం అన్ని పార్టీలను ఏకం చేసే పనిలో పడ్డారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబునాయుడు తాజాగా బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడను కలిశారు. ఆ తర్వాత చెన్నై వెళ్లి స్టాలిన్‌తో సమావేశం అయ్యారు. బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు సహకరించాలని కోరారు.
ఢిల్లీ పర్యటనలో శరద్ పవార్, మాయావతి, అఖిలేశ్ యాదవ్, కేజ్రీవాల్, ఫరూక్ అబ్దుల్లా తదితర పార్టీల నాయకుల్ని కలిసి.. మోదీ వ్యతిరేక కూటమిలోకి తెచ్చేందుకు అంగీకరింపజేసిన చంద్రబాబు.. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై దృష్టిపెట్టారు. దక్షిణాదిలో ఉన్న రెండు కీలక ప్రాంతీయ పార్టీలతో చంద్రబాబు చర్చలు జరిపిన తర్వాత కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ చంద్రబాబుతో చర్చించడానికి రావడం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. బెంగళూరు, చెన్నై సమావేశాల్లో ఏమేం చర్చించారు? బీజేపీయేతర కూటమిని మరింత బలోపేతం చేయడానికి ఏమేం చేయాలనే అంశం అశోక్ గెహ్లాట్, చంద్రబాబు ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అశోక్ గెహ్లాట్ రాక విషయం ఏపీ కాంగ్రెస్ కంటే ముందే టీడీపీకి సమాచారం అందడం ఇక్కడ విశేషం.