మోడీ, షా ని తట్టుకోలేక, ఒక్కో పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేస్తుంది. తెలుగుదేశం పార్టీ మోడీ పై ఎదురు తిరిగిన దగ్గర నుంచి, ఎదురు లేదు అనుకున్న, మోడీ-షా పతనం మొదలైంది. తెలుగుదేశం పార్టీ, ఉపేంద్ర కుశ్వాహ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీలు కమలానికి కటీఫ్ చెప్పాయి. అటు శివసేన సైతం బీజేపీపై బాహాటంగానే విమర్శలు గుప్పిస్తోంది. తాజగా, భారతీయ జనతా పార్టీకి మరో ప్రాంతీయ పార్టీ షాకిచ్చింది. ఎన్డీయే కూటమి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించింది. అస్సాంకు చెందిన అసోం గణ పరిషత్ (ఏజీపీ) స్థానికి అధికా పార్టీ బీజేపీ నుంచి పొత్తు విరమించుకుంటున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి దిలిప్ పత్గిరి తెలిపారు. పౌరసత్వ (సవరణ) బిల్లు 2016కు వ్యతిరేకంగా తాము ఎన్డీయే నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు.
బిల్లు విషయంలో ముందుకెళ్తే పొత్తు తెగతెంపులు చేసుకుంటామని గతంలోనే హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి విస్పష్టంగా చెప్పామని ఏజీపీ ప్రతినిధి దిలీప్ పత్గిరి మీడియాతో చెప్పారు. అయినప్పటికీ బీజేపీ ఆ బిల్లుపై ముందుకెళ్తామని ప్రకటించడంతో పొత్తుకు మంగళం పలుకుతున్నామని చెప్పారు. ‘‘పౌరసత్వ బిల్లు విషయమై బీజేపీ నుంచి ఏజీపీ వైదొలగాలని క్రిష్ణక్ ముక్త్ సంగ్రామ్ సమితి నేతృత్వంలో 70 సంస్థలు మాపై (ఏజీపీ) ఒత్తిడి తీసుకువచ్చాయి. ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందకుండా కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేశాం. అయితే మంగళవారం లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందింది. అనంతరం ఈ విషయమై ఢిల్లీలో హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసుకుని వైదొలగుతున్నట్లు స్పష్టం చేశాం’’ అని పార్టీ అధికార ప్రతినిధి దిలిప్ పత్గిరి తెలిపారు.
పౌరసత్వ చట్టం-1955కి సవరణలు చేస్తూ ఇప్పటికే లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టింది కేంద్రం. ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వచ్చిన మైనార్టీలు (హిందువులు, సిక్కులు, బుద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లు) భారత్‌లో ఆరేడేళ్లుగా నివసిస్తుంటే..వారి వద్ద ఎలాంటి ప్రభుత్వ డాక్యుమెంట్లు లేకున్నా భారత పౌరసత్వం కల్పించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ఐతే ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజలు..ముఖ్యంగా అసోంలోని చాలా వర్గాలు, సంస్థలు పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. ఈ చట్టంతో అస్సామీల సంస్కృతి, సంప్రదాయాలతో పాటు తమ ఉనికి దెబ్బతినే ప్రమాదముందని అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. ప్రజల ఆందోళనకు మద్దతు ప్రకటించిన ఏజీపీ.. ఆ మేరకు కమలంతో కటీఫ్ చేసుకుంది.