కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో తీసుకొస్తున్న పౌరసత్వ (సవరణ) చట్టం-2016ను వ్యతిరేకిస్తూ తాము చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిందిగా అఖిల అసోం విద్యార్థుల సంఘం ముఖ్యమంత్రి చంద్రబాబును అభ్యర్ధించింది. సోమవారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్ నాయకులు అసోంలో స్థానికులను మైనారిటీలుగా మార్చేందుకు కేంద్రం చేస్తున్న కుట్రను తిప్పికొట్టడంలో సహకరించాలని కోరారు. అసోంలో సరిహద్దు వలసలపై 1979 నుంచి ఆందోళన చేస్తున్న అఖిల అసోం విద్యార్థుల సంఘం (ఎఎఎస్‌యు) దీనిపై సవరణ చట్టం తెచ్చేందుకు ఇటీవల జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకోవడంలో గట్టిగా పోరాటం చేస్తోంది.
దేశంలో బీజేపీయేతర రాజకీయపక్షాలను ఏకం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మద్దతు తమకు అత్యంత అవసరమని భావించిన అఖిల అసోం విద్యార్థుల సంఘం (ఎఎఎస్‌యు) భావిస్తోంది. అందులో భాగంగా ముఖ్యమంత్రిని కలిసి సమస్యను కూలంకుషంగా వివరించి తమ పోరాటానికి మద్దతు కావాలని కోరింది. అసోం స్థానిక ప్రజానీకం ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నా సవరణ బిల్లును ఆర్డినెన్సు రూపంలో తెచ్చేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీన్ని అడ్డుకునేందుకు రాజకీయంగా తమకు సహకరించాలని అడిగింది. వలసల సమస్యకు మతకోణాన్ని జోడించి పబ్బం గడుపుకునేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ కుటిల యత్నాలు చేస్తోందని ఎఎఎస్‌యు నేతలు ముఖ్యమంత్రికి వివరించారు. స్థానికుల ఆకాంక్షలకు విరుద్ధంగా బీజేపీ ఈ బిల్లును తెచ్చిన పక్షంలో రెండు దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉన్న అసోంలో మళ్లీ గొడవలు రాజుకొనే పరిస్థితులు అధికంగా ఉన్నాయని వారీ సందర్భంగా ఆందోళన వెలిబుచ్చారు.
అసోం ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సునిశిత సమస్యపై పార్టీలో చర్చించి అక్కడి స్థానికులకు అన్నివిధాలుగా న్యాయం జరిగేలా ఎలా వ్యవహరించాలన్న అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎఎఎస్‌యు ప్రతినిధులకు చెప్పారు. జాతీయ సమగ్రతను కాపాడే ఆలోచన కేంద్ర పాలకుల్లో ఏకోశానా కనిపించడం లేదని, రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాలతో ఆడుకుంటున్నారని ఆయనీ సందర్భంగా ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను గౌరవించడం పాలకుల విధిగా చెబుతూ, దానికి విరుద్ధంగా వ్యవహరించే శక్తులపై పోరాడటానికి ప్రజాస్వామ్యవాదుల ఏకీకరణ అనివార్యమని అన్నారు. గతంలో అసోంలో జరిగిన అనేక విద్యార్ధి పోరాటాలకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసిన ఎఎఎస్‌యూ అధ్యక్షుడు దీపాంక కుమార్ నాథ్, పార్లమెంటులో ఈ సమస్యపై పోరాడేందుకు సీనియర్ రాజకీయవేత్తగా తమకు మార్గదర్శనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో దీపాంకతో పాటు స్టూడెంట్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి లురిన్ జ్యోతి గొగొయ్. ముఖ్య సలహాదారు సముజ్జల్ భట్జాచార్య, ప్రొఫెసర్ బసంత్ దేకా, గౌహతి యూనివర్శిటీ ప్రొఫెసర్ శిఖా శర్మ ఉన్నారు.