ఈవీఎం... దీని చుట్టూ మళ్లీ పెను వివాదం. ఎన్నికల ప్రక్రియ మొత్తంలో విప్లవాత్మక మార్పులకు దారిచూపిన ఈ యంత్రాలలో కావాల్సిన రీతిలో ఫలితాలను మార్చుకోవచ్చన్న అనుమానాలు పెనుభూతంగా మారాయి. తాజాగా జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో చాలావరకు ఈవీఎంలు సరిగా పనిచేయలేదని, వాటిపై నమ్మకం లేదని తెలుగుదేశం పార్టీ వాదిస్తోంది. కనీసం 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను కూడా లెక్కించాలని జాతీయ స్థాయిలో ఇతర ప్రతిపక్షాలతో కలిసి డిమాండ్ చేస్తోంది. వీటి పనితీరుపై ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చే జరుగుతోంది. ప్రస్తుతం ఈవీఎంల పై దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఈవీఎంలు మొరాయించాయని, వాటిని సులభంగా ట్యాంపరింగ్ చేయవచ్చని సీఎం చంద్రబాబునాయుడు ఆరోపిస్తున్నారు.
విపక్ష నేతలతో కలిసి జాతీయస్థాయిలో పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈవీఎంలకు సంబంధించి తెలంగాణలో మరో వివాదం రాజుకుంది. స్ట్రాంగ్ రూమ్స్‌లో ఉండాల్సిన ఈవీఎంలు రోడ్ల పై కనిపించడంపై దుమారం రేగుతోంది. జగిత్యాలలో సోమవారం రాత్రి ఓ ఆటోలో ఈవీఎంలను తరలించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రి పూట ఎవరూ చూడకుండా, ఆటోలో ఈవీయంలు తీసుకు పోవటం, పెద్ద దుమారం రేగింది. అయితే అవి పోలింగ్ రోజున వినియోగించిన ఈవీఎలు కాదని ఎన్నికల అధికారులు క్లారిటీ ఇచ్చారు. రాయికల్, సారంగపూర్ గ్రామాల్లో ఓటర్ల అవగాహన కోసం వినియోగించిన ఎం2 రకం ఈవీఎంలని స్పష్టంచేశారు.
ఎన్నికల అధికారులు చెప్పిన వివరాల ప్రకారం..వాటిని సోమవారం రాత్రి జగిత్యాల అర్బన్ తహశీల్దార్ కార్యాలయం నుంచి మినీ స్టేడియం గోదాంకు తరలించారు. ఐతే గోదాంకు తాళంవేసి ఉండడంతో తిరిగి తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు. రెండు రోజుల క్రితం కూడా జగిత్యాలలో ఇదే తరహా వివాదం చెలరేగింది. కారులో ఈవీఎంలను తరలించడంపై రాజకీయ పార్టీలు మండిపడ్డాయి. ఎన్నికల అధికారులు తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఈ రెండు ఘటనలను జగిత్యాల కలెక్టర్ శరత్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. దీనిపై విచారణ జరుపుతున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉద్యోగులపై చర్యలు తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.