గత నెల రోజులుగా వైసీపీ నేతలు చేస్తున్న హడావిడి చూస్తున్నాం. మేమే వచ్చేస్తున్నాం, మా జగన్ అన్న సియం అవుతాడు, మీ అంతు చూస్తాం అంటూ, వైసీపీ నేతలు వార్నింగ్‌లు ఇవ్వడం ప్రారంభించేశారు. తాజాగా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ సింహాచలం దేవస్థానం ఈవోపై బెదిరింపులకు పాల్పడ్డారు. మే 23 తర్వాత నీ సంగతి చెప్తా అంటూ ఊగిపోయారు. ఆలయంలోని గర్భాలయంలోకి అనుమతించకపోవడంతో అవంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇంకా సిట్టింగ్ ఎంపీనని గుర్తుచేశారు. భార్య, కుమారుడు, అల్లుడితో దర్శనానికి వెళ్లిన ఆయనకు ఈఓ గర్భగుడి దర్శనం కల్పించలేదు. దీనిపై ఆగ్రహించిన అవంతి శ్రీనివాసరావు తానింకా ఎంపీనే అని, ఆ విషయం మరిపోవద్దన్నారు. మే 23 తరువాత మీ విషయం చూస్తామంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇదిలా ఉంటే సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో చందనోత్సవం ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు సింహాచలం తరలివస్తున్నారు. ఆనవాయితీ ప్రకారం పూజపాటి రాజవంశస్థులు కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు తొలి చందనం సమర్పించి, నిజరూప దర్శనం చేసుకున్నారు. అనంతరం సామాన్య భక్తులకు దర్శనం చేసుకునే సదుపాయం కల్పించారు. ఈ ఉత్సవాలకు ఏపీ హోమంత్రి చినరాజప్ప సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఉదయం సుమారు 10.30 గంటల సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు సింహగిరికి తరలివచ్చారు. రూ.వెయ్యి, రూ.500, రూ. 200 క్యూలైన్లు సాఫీగా జరిగిపోయినప్పటికీ ఉచిత క్యూలైన్లలో భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.
దేవస్థానం ఏర్పాటు చేసిన వరుసలను దాటిపోయి సింహగిరి ఘాట్‌రోడ్డు వరకు భక్తులు బారులుతీరారు. ఒకవైపు ఎండవేడి, కాళ్లకు చెప్పులు లేకపోవడంతో భక్తులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. అసహనానికి గురై తోపులాటలకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు రంగ ప్రవేశం చేసి భక్తులను నియంత్రించేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. అదే సమయంలో జిల్లా కలెక్టర్ భాస్కర్ కారులో వెళ్తుండగా ఆయనపై భక్తులు ఆగ్రహం వెల్లగక్కారు. కలెక్టర్ నేరుగా ఆలయంలోని నీలాద్రి గుమ్మం వద్దకు వెళ్లి ఈవో రామచంద్రమోహన్‌తో కలిసి క్యూలైన్లలోని భక్తులను వేగంగా వెళ్లేలా చర్యలు చేపట్టారు. ఉచిత క్యూలైన్లలోని భక్తులను ఖాళీగా ఉన్న రూ.500, రూ.200 వరుసల్లోకి మళ్లించారు. దీంతో భక్తులు శాంతించారు.