ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి అవార్డుల పరంపర కొనసాగుతోంది. రాష్ట్ర విభజన అనంతరం 13 జిల్లాల పరిధిలో పర్యటక రంగ పరంగా చేపడుతున్న ప్రాజెక్టులు ఇప్పటికే ఫలితాలను ఇస్తూ రాగా, వివిధ జాతీయ, అంతర్జాతీయ స్ధాయి సంస్ధలు పర్యాటక శాఖకు అవార్డులు అందిస్తున్నాయి. తాజాగా పసిఫిక్ ప్రాంత పర్యాటక రచయితల సంస్ధ ఆంధ్రప్రదేశ్ టూరిజంకు అవార్డు ప్రకటించింది. మార్చి తొ్మ్మిదో తేదీన బెర్లిన్ వేదికగా జరిగే అవార్డుల ప్రదానోత్సవంలో అతిరధ మహారధుల సమక్షంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అవార్డును అందుకోనున్నారు.
సాగరతీర పర్యాటకంలో ఉత్తమ ఆగమన కేంద్రం విభాగంలో ఈ అవార్డును అందిస్తున్నట్లు, పట్వా ప్రధాన కార్యదర్శి సాగర్ ఆహ్లువాలియా రాష్ట్ర పర్యాటక శాఖకు సమాచారం అందించారు. అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా బెర్లిన్ వేదికగా ఫసిఫిక్ ఏరియా ట్రావెల్ రైటర్స్ అసోసియేషన్ పలు కార్యక్రమాలను చేపడుతుండగా, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అయా కార్యక్రమాలలో భాగస్వామ్యం కాబోతుంది. వరల్డ్ టూరిజం, ఏవియేషన్ లీడర్స్ సమ్మిట్‌తో పాటు, సుస్దిర పర్యాటకం అనే అంశంపై అంతర్జాతీయ స్ధాయి సెమినార్ జరగనుంది.
ఈ సందర్భంగా పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ విభజన అనంతరం ఎదురవుతున్న ఇబ్బందులను సైతం అధికమించి సమగ్ర అభివృద్దికి అవసరమైన ప్రణాళికలను అమలు చేస్తుండగా, దీనిని జాతీయ, అంతర్జాతీయ స్ధాయి సంస్ధలు గుర్తించటం ముదావహమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడి నుండి తమకు లభిస్తున్న ప్రోత్సాహంతో ఈ విజయాలను సాధించగలుగుతున్నామని, ఈ క్రమంలో పర్యాటక శాఖ ఉద్యోగుల పనితీరు ప్రశంసనీయమైనదని మీనా వివరించారు. అవార్డు సాధనలో గణనీయమైన భూమికను పోషించిన ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ది సంస్ధ, ఆంధ్రప్రదేశ్ టూరిజం అధారిటీ అధికారులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభినందనలు తెలుపుతున్నామన్నారు.