తెలుగుదేశం పార్టీ మొన్నటి ఎన్నికల్లో ఓటమి పై సమీక్షలు చేసుకుంటుంది. అంత బాగా పని చేసినా, ఎందుకు ఇలా ఓడిపోయామనే విషయం పై అన్ని వర్గాల నుంచి సమాచారం తెప్పించుకుంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు వివిధ వర్గాలతో సమీక్షలు జరుపుతున్నారు. ఈ నేపధ్యంలోనే, ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో మొదటి సారి సమావేశం అయ్యింది. ఎన్నికల్లో ఓటమి, ఓటింగ్ సరళి పై ఈ సమావేశంలో చర్చించారు. ప్రభుత్వంలో ఉండగా చేసిన తప్పులు, పార్టీలో వచ్చిన గ్యాప్, అలాగే జగన్ కు కలిసి వచ్చిన అంశాలు, దూరమైన వివిధ వర్గాల గురించి సమగ్రంగా చర్చించారు. అలాగే కొంత మంది నేతలు సరిగ్గా పని చెయ్యలేదని, చాలా మంది చంద్రబాబు ఇమేజ్ తో, అభివృద్ధి, సంక్షేమంతో గెలిచి పోతాం అనే ఓవర్ కాన్ఫిడెన్సు తో పోల్ మ్యానేజ్మెంట్ సరిగ్గా చెయ్యలేదని అభిప్రాయపడ్డారు.
ఇది ఇలా ఉంటే, సమావేశంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పదే పదే కంటతడి పెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ హయంలో ఎన్నో కార్యక్రమాలు చేసామని, అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా, చంద్రబాబు ఎలా కష్టపడ్డారో, మాకు ఇంకా కళ్ళ ముందు తిరుగుతూనే ఉందని, ఈ కష్టం అంతా ఏమైపోయిందో, ప్రజలు ఎందుకు గుర్తించలేదో అంటూ కంటతడి పెట్టుకున్నారు. 23 సీట్లు వచ్చేంతగా మనం పని చేసామా ? చంద్రబాబు ఎంత కష్టపడ్డారో చూసాం కదా, ప్రజలల్లోకి మనం ఎందుకు తీసుకువెళ్ళలేకపోయం అని ఆవేదన వ్యక్తం చేసారు. అలాగే మరో సందర్భంలో, టిడిపి మూల సిద్ధాంతం అయిన, పేదవాడికి కూడు, గూడు, బట్ట కోసమని, 5 రూపాయాలకే కడుపు నిండా భోజనం పెట్టె అన్నా క్యాంటీన్లు పెడితే, అది కూడా ముసేసారని, అది తెలియక అక్కడకి వచ్చిన వారు ఉసూరుమంటూ వెనక్కి వెళ్తున్నారని, మరో సందర్భంగలో అయ్యన్నపాత్రుడు బాధపడ్డారు.
మరో వైపు, పార్టీ ప్రక్షాళన చేసే దిశగా నిర్ణయాలు తీసుకోవలాని కొంత మంది సభ్యులు కోరారు. సోమిరెడ్డి మాట్లాడుతూ, ప్రక్షాళణ పోలిట్ బ్యూరో నుంచే జరగాలని అభిప్రాయపడ్డారు. మొన్న ఎన్నికల్లో ఎన్నో దెబ్బ తీశాయని, వైసిపీలా డబ్బులు ఖర్చు పెట్టలేక పోయామని, అలాగే కుల సమీకరణలో కూడా పూర్తిగా ఫెయిల్ అయ్యామని, సభ్యులు అభిప్రాయ పడ్డారు. పోలిట్ బ్యూరో సమావేశం అనంతరం, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు, పార్టీ ప్రక్షాళన పై చర్చించామని చెప్పారు. అలాగే ప్రస్తుతం ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పై కూడా చర్చించామని అన్నారు. ఈ రెండు నెలలు కింద స్థాయి కార్యకర్త నుంచి, ప్రభుత్వంలో పెద్దలు దాకా, మా పై కక్ష తీర్చుకోవటంతోనే కాలం గడిపెసరని అన్నారు.