దేశంలో ఎక్కడా లేనంతగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే చూసి ఓర్వలేక పనిలేని ప్రతిపక్ష నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబును నోటికొచ్చినట్లు విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు దుయ్యబట్టారు. ‘‘జీవీఎల్ నరసింహారావు ఎవరో కూడా నాకు తెలియదు..ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆయనకు ఆంధ్రప్రదేశ్‌పై పెత్తనం ఏమిటి?’’ అని మండిపడ్డారు. గుంటూరులోని తెదేపా కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాడేపల్లిగూడెంలో జరిగే సభను అడ్డుకుంటామని జీవిఎల్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన అయ్యన్నపాత్రుడు...‘‘ రా..దమ్ముంటే అడ్డుకో.. అని’’ సవాల్ విసిరారు.
ఐక్యరాజ్యసమితిలో చంద్రబాబుకు దక్కిన గౌరవం తెలుగు జాతికి దక్కిన గౌరవమని, అది డబ్బు, పలుకుబడితో దక్కదని కన్నా, జీవీఎల్ లు తెలుసుకోవాలని ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. ఈ రోజు ఆయన ఉయ్యూరులో మీడియాతో సమావేశమై మాట్లాడుతూ సేంద్రీయ వ్యవసాయంలో తెలుగుజాతి ఘనతను ప్రపంచ వేదిక మీద ప్రపంచానికి చంద్రబాబు చాటి చెప్పారని కొనియాడారు. చంద్రబాబుకు దక్కిన గౌరవం చూసి కన్నా, జీవీఎల్ లు ఈర్ష్య, అసూయలతో రగిలి పోతున్నారని విమర్శించారు. కన్నా, జీవీఎల్ లకు పిచ్చికుక్క కరచినట్లుందని, అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాఫెల్ కుంభకోణం పై జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పాదయాత్రల పవిత్రతను జగన్ మంటగలిపాడని, 3,000 కాదు 30 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినా జగన్ ను ఆంధ్రప్రజలు విశ్వసించరని, జగన్, మోడీ, పవన్ ల అపవిత్ర కూటమిని ప్రజలు తిరస్కరిస్తున్నారని రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాలో కూడా ముందస్తు ఎన్నికలు వస్తాయని జగన్ కు మోదీ చెప్పారా? ఆంధ్రాలో బీజేపీకి ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకరన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ నేతలు తప్పుడు కూతలు కూస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమ విమర్శించారు. అమరావతి బాండ్లు సహా ఏ అంశంపై అయినా బీజేపీ నేతలతో బహిరంగ చర్చ జరిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.