24 గంటలుగా నర్సీపట్నంలో జరుగుతున్న హైడ్రామాకు తెర పడింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. నిన్నటి నుంచి అయ్యన్నపాత్రుడుని అరెస్ట్ చేయటానికి, నర్సీపట్నం మొత్తం పోలీసులతో నింపేసారు. అయితే అయ్యన్న అభిమానులు, తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకొని 24 గంటల నుంచి అక్కడే ఉండటంతో, పోలీసులు, అయ్యన్న ఇంటి లోపలకు వెళ్ళే సాహసం చేయలేదు. నిన్నటి నుంచి టిడిపి శ్రేణులు అయ్యన్నను కాపాడుతూనే ఉన్నాయి. నిన్న ఉదయం నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడు ఇంటికి, నల్లజెర్ల పోలీసులు వచ్చారు. అయ్యన్నపాత్రుడు జగన్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసారని, ఆయన పైన కేసు నమోదు అయ్యిందని, ఆయనకు నోటీసులు ఇవ్వాలని చెప్పారు. అయితే అయ్యన్న పాత్రుడు ఇంట్లో లేరని, అక్కడి వారు చెప్పటంతో, ఆయన వచ్చిన తరువాతే ఇక్కడ నుంచి వెళ్తామని కూర్చున్నారు. అయితే అయ్యన్న రాకపోవటంతో, ఆయన ఇంటికి 41ఏ నోటీసు అంటించిన పోలీసులు, అక్కడ నుంచి వెళ్ళినట్టే వెళ్లి, మళ్ళీ అదనపు బలగాలను రప్పించి, నర్సీపట్నం మొత్తం మొహరించారు. నిన్న సాయంత్రం నుంచి నర్సీపట్నంలో హైడ్రామా నేలోంది.
ఏ క్షణమైనా అయ్యన్న ఇంట్లోకి పోలీసులు వస్తారని, అయ్యన్నని అరెస్ట్ చేస్తారని ప్రచారం చేసారు. అయితే పెద్ద ఎత్తున తెలుగుదేశం శ్రేణులు అయ్యన్న ఇంటికి వచ్చాయి. నిన్నటి నుంచి అందరూ అక్కడే ఉన్నారు. అక్కడే భోజనాలు చేసారు. రాత్రంతా అక్కడే రక్షణగా నిలిచారు. తెలుగుదేశం శ్రేణులు ఎక్కువగా ఉండటంతో, పోలీసులు అయ్యన్న ఇంటి మీదకు వెళ్ళే సాహసం చేయలేదు. సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ తరుణంలో అయ్యన్నపాత్రుడు తన పైన పెట్టిన కేసు పైన, హైకోర్ట్ లో క్వాష్ పిటీషన్ దాఖలు చేసారు. తన కేసు కొట్టేయాలని, అది రాజకీయ ప్రేరేపిత కేసు అని, కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. అయితే దీని పైన విచారణ చేసిన హైకోర్టు, ఈ కేసు విషయంలో తదుపరి చర్యలు అన్నీ నిలిపివేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో టిడిపి కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది సేపట్లో నారా లోకేష్, అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్లనున్నారు. అయ్యన్నపాత్రుడుని పరామర్శించనున్నారు.