మహారాష్టల్రోని ధర్మాబాద్ కోర్టు వారెంట్లపై తెలుగుదేశం పార్టీలో తర్జనభర్జన కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు 15 మందికి జారీ చేసిన నాన్‌బెయిలబుల్ వారెంట్‌పై టీటీడీపీ నేతలతోనూ చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌లో సమీక్ష జరిపారు. ధర్మాబాద్‌కు వెళ్దామా లేదా రీకాల్ పిటిషన్ వేద్దామా అని ఆయన పార్టీ నేతలను ప్రశ్నించారు. గతంలో అనేక వారెంట్లు జారీ చేసినా హాజరుకాలేదన్న ఆరోపణలపై సీఎంఓ అధికారులను పిలిచి ఏ విధమైన వారెంట్లు వచ్చాయో పరిశీలించమని ఆదేశించగా, గతంలో ఎన్నడూ ఇలాంటి కేసుకు సంబంధించి ఎలాంటి వారెంట్లు రాలేదని అధికారులు వివరించారు. ప్రస్తుతం తాజాగా జారీ అయినట్టు చెబుతున్న నాన్‌బెయిలబుల్ వారెంట్ అందినట్టు అధికారులు చంద్రబాబుకు చెప్పారు.
ఈ అంశంపై టీడీపీ ఎదురుదాడిని తీవ్రతరం చేసినా, వ్యవహారం మాత్రం సాంకేతికంగా కోర్టులో తేల్చుకోవల్సిందేనని చంద్రబాబుకు అధికారులు సూచించినట్టు సమాచారం. న్యాయస్థానం నుండి నోటీసులు వచ్చినపుడు వాటికి లేని పోని ఆరోపణలను ఆపాదించలేమని, అయితే నోటీసులతో సంబంధం లేకుండా బీజేపీ, టీఆర్‌ఎస్ చేస్తున్న రాజకీయ కక్ష సాధింపుపై వేరుగా మాట్లాడాలని న్యాయనిపుణులు చంద్రబాబుకు తెలిపారు. ఈ నెల 23న అమెరికా వెళ్లి పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన తరుణంలో వారెంట్లపై టీడీపీ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ వ్యవహారం మరింత ముదరకుండా పరిష్కారం కనుగొనాలని టీడీపీ యోచిస్తోంది. దీనిపై మరింత స్పష్టత ఇవ్వాలని భావించిన సీఎం వారెంట్ల వ్యవహారాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడంతో పాటు ఏపీ మంత్రులు, తెలుగుదేశం ముఖ్య నేతలు, అధికారులతో అమరావతిలో కీలక భేటీ నిర్వహించారు.
న్యాయవ్యవస్థను గౌరవిస్తూ మహారాష్టల్రోని ధర్మాబాద్ కోర్టుకు వెళ్దామని చంద్రబాబు టీటీడీపీ నేతలతో పేర్కొనగా, ఒకవేళ ఆయన కోర్టుకు హాజరుకావాలని నిర్ణయించినట్టయితే ఆయన వెంట వచ్చేందుకు రైతులు కూడా సిద్ధంగా ఉన్నారని వారు పేర్కొన్నారు. మరో మారు ఈ అంశాన్ని చర్చిద్దామని టీటీడీపీ నేతలకు చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. ఐక్యరాజ్య సమితి సదస్సులో ప్రసంగించాల్సి ఉండటంతో టీడీపీ నేతలు వారెంట్ల అంశంపై ఆందోళనకు గురవుతున్నారు. వారెంట్ల వ్యవహారాన్ని తెల్చుకోకుండా అమెరికా వెళితే ఏమైనా ఇబ్బందులు వస్తాయా అని చంద్రబాబు న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. వారెంట్ల రీకాల్‌కు పిటిషన్‌కు వేయాలా? లేదా? కోర్టు ముందు హాజరై అనంతరం బెయిల్ పొందాలా? లేదా? ముంబై కోర్టులో పిటిషన్ దాఖలు చేసి జిల్లా న్యాయమూర్తి ఆదేశాలపై స్టే తెచ్చుకోవాలా? అనే కోణంలోనూ చర్చలు జరుగుతున్నాయి.