తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ త్వరలో సమావేశంకానున్నారని తెలిసింది. జులై నెలలో వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు ముందు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో ఢిల్లీలో భేటీకానున్నారని సమాచారం. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజన చట్టంలో పొందుపరిచిన హామీల అమలు పురోగతి ఇతర అంశాలపై చర్చించనున్నట్టు తెలిసింది. విభజన చట్టంలో రెండు తెలుగు రాష్ట్రాలకు పలు హామీలను పొందుపరిచిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఏపీలోని కడప జిల్లాలో టీడీపీ నాయకులు ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. కడపతో పాటు ఖమ్మం జిల్లాలోని బయ్యారంలోనూ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేయాల్సి ఉన్నది. ఏపీకి సంబంధించి ప్రత్యేకహోదా, రైల్వేజోన్ తదితర అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి.
మరో పక్క కెసిఆర్, చంద్రబాబు కలవకుండా మోడీ పాచిక వేసారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చి ఆయన చంద్రబాబు వైపు వెళ్లకుండా కట్టడి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకమైతే వారి ఖాతాలో 30కి పైగా సీట్లు ఉంటాయని, ఎన్నికల తర్వాత వారి నిర్ణయం కీలకమవుతుందని భావించిన మోదీ భేదోపాయం ప్రయోగించారు. ఏ ముఖ్యమంత్రి అయినా తమ రాష్ట్రాలలో నెలకొన్న పరిస్థితులను బట్టి రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారు. ఈ కారణంగానే ప్రత్యామ్నాయ ఫ్రంట్ పేరిట తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హడావుడి చేసినా అది పురుడుపోసుకోలేకపోయింది. అందుకే కెసిఆర్ ప్రతి విషయంలో మోడీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అయితే, ఎన్నికల సమీపిస్తున్న వేళ, విభజన హామీల అమలు పై, ఎదో చేస్తున్నాం అనే బిల్డ్ అప్ ఇవ్వటం కోసం, ప్రధాని ఇద్దరు ముఖ్యమంత్రులతో కలిసి, ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు అనే అభిప్రాయం కలుగుతుంది.
మొత్తం 19 అంశాల పై, కేంద్రం మనకు అన్యాయం చేస్తుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు వనరుల ప్రాధాన్యత కల్పించడం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రైల్వే జోన్ ఏర్పాటు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, విశాఖ, విజయవాడ మెట్రో రైల్, పేట్రో కెమికల్ కాంపెక్స్ ఏర్పాటు, జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థల ఏర్పాటు, నెల్లూరులో దుగ్గిరాజపట్నం పోర్టుతో పాటు, అమరావతికి ఆర్థిక సహాయం, పన్నుల సవరణ, కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ, వైజాగ్, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు, అమరావతికి సమగ్ర రవాణా కనెక్టివిటీ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, డిస్కంల ద్వారా విద్యుత్ బకాయిల చెల్లింపులు, 9వ షెడ్యూల్, 10వషెడ్యూల్ సంసలు, గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం ఏర్పాటు వంటి అంశాల గురించి, ఇప్పటికీ క్లారిటీ లేదు.