వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్పై కోడికత్తితో దాడి చేసిన నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ కు బెయిల్ మంజూరైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న శ్రీనివాస్ కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నందున బెయిల్ మంజూరు చేయాలని అతని తరఫు న్యాయవాది సలీమ్ వారం క్రితం విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో సెక్షన్ 55(ఎ) కింద పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి న్యాయనిపుణుల అభిప్రాయం కోర్టు ముందుకు రావడంతో గురువారం వాదనలు జరిగాయి. తన క్లయింట్ మలేరియా, డెంగీ, అజీర్ణంతో బాధపడుతున్నాడని సలీమ్ వాదించారు. గుండె సంబంధిత వ్యాధి సోకే అవకాశం కూడా ఉందన్నారు. ఈ వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి పార్ధసారథి రూ.60 వేలు, ఇద్దరి పూచికత్తుపై బెయిల్ మంజూరు చేశారు.
బెయిల్ పై బయటకు రాగానే శ్రీను సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎయిర్ పోర్టులో తాను కుక్ గా పనిచేస్తూ ఉండేవాన్ని అని.. ప్రజల సమస్యలపై తాను చాలా రాశానని అవన్నీ జగన్ కు తెలియజేయాలని చూశానని వైజాగ్ ఎయిర్ పోర్టులో దాడి చేసిన శ్రీనివాస్ చెప్పాడు. తాను జగన్ అభిమానిని కాదని తేలిస్తే శిరచ్ఛేదనం చేసుకుంటానని శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. ఆ రోజు తాను జగన్ ను చంపాలని అసలు అనుకోలేదని శ్రీనివాస్ చెప్పారు.. అది పొరపాటున జరిగింది అని అన్నారు. తన ఆలోచనలకు సంబంధించిన విషయాలను జగన్ తో ఆరోజు చెప్పాలని అనుకున్నానని శ్రీనివాస్ చెప్పారు.
ఆరోజు తాను ఫోటో కోసం వెళ్లానని.. కంగారుగా ఏమి చేశానో కూడా తనకు తెలీదు అని శ్రీనివాస్ చెప్పారు. ఆయనకు ఏమి తగిలిందో కూడా తనకు తెలీదని శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు. ఆరోజు అక్కడ ఉన్న వాళ్ళు చంపేసేవాళ్ళని.. కానీ జగన్ తనను కొట్టొద్దని చెప్పారని శ్రీనివాస్ చెప్పాడు. తాను వంటవాన్ని అని.. తన దగ్గర ఫోర్క్ లాంటివి ఎన్నో ఉన్నాయని శ్రీనివాస్ చెప్పారు. అది యాక్సిడెంటల్ గా జరిగిందని శ్రీనివాస్ వెల్లడించారు. తన మీద చాలా అవాస్తవాలు సృష్టించారని శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు. ప్రమాదవశాత్తూ జరిగింది తప్ప మరేదీ కాదని శ్రీనివాస్ చెప్పడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. జగన్ కు సానుభూతి రావడం కోసం తాను ఈ పని చేయలేదని అన్నారు శ్రీనివాస్.